మాయని గాయాలు

“మీరు నాకు అబార్షన్ చేయాలి, డాక్టర్!" సన్నగా కంపిస్తూన్న స్వరంతో అన్న ఆ యువతి వంక పరిశీలనగా చూసింది డాక్టర్ ధరణి.

ఇరవై ఏళ్ళుంటాయి. తెల్లగా, పొడవుగా, స్లిమ్ గా, అందంగా ఉంది. లేత కనకాంబరం రంగు చీర, మ్యాచింగ్ బ్లౌజ్ లో చూడముచ్చటగా ఉంది. మెళ్ళో సింపుల్ గా ఓ ముత్యాల హారం. అమాయకత్వం ప్రతిఫలించే వదనంలో నీలినీడలు. ఆందోళనను అణచుకోవడానికి ఆమె చేస్తూన్న ప్రయత్నం తెలుస్తూనేవుంది.

ఆమె అవివాహిత అనిపించినా, "చెప్పమ్మా, నీ పేరేమిటి? ఎబార్షన్ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నావు? ఇప్పుడే పిల్లలు కలగడం మీవారికి ఇష్టం లేదా?" అనడిగింది ధరణి.

ఎదుటివారి సానుభూతి కష్టంలో ఉన్నవారిని ఇట్టే కరగించివేస్తుంది కాబోలు. డాక్టర్ స్వరంలో ఏం మార్దవం ఉందో కాని, చేతుల్లో ముఖం కప్పుకుని భోరున ఏడ్చేసింది ఆ పిల్ల తనకు తెలియకుండానే.

నలభై ఐదేళ్ళ ధరణి తన ప్రొఫెషన్లో అటువంటి కేసులు చాలానే చూసింది. అమాయకులైన ఆడపిల్లల్ని వయసు చేసే మోసం...అబ్బాయిలు చేసే వంచన...డిప్రెషన్ కి గురిచేసి చివరికి ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెడతాయి. పరిస్థితుల్లో మార్పు ఉండవచ్చును. పద్ధతులు వేరు కావచ్చును. ఫలితం మాత్రం ఒకటే! అనాదిగా, ఆనవాయితీగా ఆడపిల్ల గురవుతున్న ఘోర పరాభవం అదే! ప్రకృతి సైతం ఆమెకు వ్యతిరేకం కావడం శోచనీయం!

కుర్చీలోంచి లేచి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది ధరణి. ఆప్యాయంగా తల నిమిరింది. పక్కనే కూర్చుని, "దుఃఖం మనసుకు ఉపశమనం కలిగిస్తుంది కాని సమస్యకు పరిష్కారం సూచించలేదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్" అంది శాంతంగా.

క్షణాలలో కంపోజ్ చేసుకుంది ఆ పిల్ల. "నా పేరు నీలిమ, డాక్టర్!" అంది కళ్ళు తుడుచుకుంటూ.

"డాక్టర్ కాదు, ఆంటీ అనమ్మా! నన్ను మీ అమ్మే అనుకుని నీకొచ్చిన కష్టమేమిటో నిస్సంకోచంగా చెప్పు" అంది ధరణి, ఆమె జుట్టు సవరిస్తూ. ఆ పిల్లను చూస్తూంటే ఏదో తెలీని ఆత్మీయత పుట్టుకొచ్చింది ఆమెలో.

ఆ పర్శనల్ టచ్ కి కరిగిపోయింది నీలిమ. ఆ ఆప్యాయతకు మళ్ళీ కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. కర్చీఫ్ తో ఒత్తుకుంది.

"పెళ్ళికాకుండానే గర్భవతివయ్యావు కదూ?" అడిగింది ధరణి లీడ్ చేస్తూ.

తలూపిందామె. "ఇందులో నా తప్పు లేదు, ఆంటీ! అంతా...ఓ పీడకలలా...జరిగిపోయింది..." ఏం గుర్తుకొచ్చిందో భయంతో ఒణికిపోయింది. ఆమె భయం అర్థం చేసుకున్న ధరణి ఆమె వీపు నిమిరింది.

"నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. రెండు నెలల క్రితం ఓ స్నేహితురాలింటికి వెళ్ళి వస్తూంటే దారిలో ఓ ఆగంతకుడు బలవంతంగా ఓ పాడుబడ్డ ఇంట్లోకి లాక్కుపోయి...నన్ను...నన్ను..." వెక్కి వెక్కి ఏడ్చిందామె. ఆమె చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుంది ధరణి అనునయంగా.

ఏడ్పు ఆపి మళ్ళీ చెప్పింది నీలిమ - "ఆంటీ! ఆ అనుభవం తలచుకుంటేనే మనసు చెదరిపోతోంది. శరీరం అవమానంతో చచ్చిపోతోంది...చచ్చిపోవాలనుకున్నాను. కాని, నన్ను ప్రాణప్రదంగా ప్రేమించే నా తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఆ ఆలోచనను విరమించుకున్నాను. నాకు జరిగిన పరాభవం గురించి ఎవరికీ చెప్పలేదు. దాన్ని పీడకలగా ఎంచి మరచిపోవాలని విశ్వప్రయత్నం చేసాను. కొన్నాళ్ళు ఇంట్లోంచి బైటకే రాలేదు నేను. కాంత్ ని కూడా కలుసుకోలేదు..."

"కాంత్...నీ బాయ్ ఫ్రెండా?" అడిగింది ధరణి.

ఔనన్నట్లు తలూపిందామె. "కాంత్, నేనూ ప్రేమించుకున్నాం. విషయం అతనికి చెప్పలేక, అలాగని దాచిపెట్టి అతన్ని మోసం చేయనూలేక తప్పించుకుని తిరగడం ఆరంభించాను. నన్ను చూడందే ఉండలేని కాంత్ నా ప్రవర్తనకు నన్ను నిలదీసాడు. జరిగిన సంగతి అతనికి చెప్పక తప్పలేదు. అంతా ఆలకించి అతనేమన్నాడో తెలుసా, ఆంటీ?"

పేలవంగా నవ్వింది ధరణి. "ఎంగిలాకును తాను ముట్టలేను అనుంటాడు. నువ్వు లేకుంటే చచ్చిపోతానని డైలాగులు చెబుతూ ప్రేమ దోమ అంటూ అంతవరకు నీ వెంటపడి వేధించినవాడు కాస్తా, నీకు దూరంగా పారిపోయుంటాడు...ఏ మగాడి చరిత్ర తిరగేసినా కనిపించే రంగు ఇదే కదా!" అంది నిరాసక్తంగా.

"లేదాంటీ! మీరు పొరబడుతున్నారు. నా కాంత్ అలాంటివాడు కాదు," చటుక్కున అంది నీలిమ. "మలినమైన నా శరీరాన్ని తనకు అప్పగించలేననీ, నన్ను మరచిపొమ్మనీ అంటే...అతనేమన్నాడో తెలుసా? జరిగిందాంట్లో నీ తప్పేముందీ? ఇందుకు సిగ్గుపడవలసిందీ, అవమానంతో తల వంచుకోవలసిందీ నువ్వు కాదు, నీలూ! నిన్ను పరాభవించి తన నైతిక పతనాన్ని చాటుకున్న ఆ కామోన్మాది! అటువంటి పిచ్చికుక్కల్ని అదుపులో పెట్టలేని ఈ సోకాల్డ్ నాగరిక సమాజం!! మలినమంటూ అంటితే అది శరీరానికేగాని, నీ మనసుకు కాదుగా! దాని గురించి అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నాదానివే!...అంటూ నన్ను తన హృదయానికి హత్తుకుని ఓదార్చాడు. నా మనసును సేదదీర్చాడు".

ధరణికి ఆశ్చర్యము, ఆనందమూ కూడా కలిగాయి…అత్యాచారానికి గురైన ఆడదాని బాధ్యత అందులో ఎంతవరకు అన్నది ఆలోచించకుండా, తప్పంతా ఆమెదేనన్నట్లు స్త్రీని వెలివేసి ఆమె భవిష్యత్తును నాశనంచేసే ఈ స్వార్థపూరిత సమాజంలో కాంత్ వంటి ఆధునిక భావాలుగల యువకుడు ఉండడం - గంజాయి వనంలో తులసి మొక్కలా - ఎంతో రెఫ్రెషింగ్ గా అనిపించింది. అత్యాచారం జరిపిన మగాడు ధైర్యంగా తలెత్తుకు తిరుగుతూంటే...అందుకు బలైన ఆడది మాత్రం ఘోరాపరాధం చేసినట్లు నాలుగు గోడల మధ్యా క్రుంగిపోవడమో, ఆత్మాహుతికి పూనుకోవడమో అనాదిగా వస్తూన్న అనాచారం! అందులో ఒక్క పురుషుడే కాదు, సాటి స్త్రీ కూడా భాగస్వామిని కావడం మరింత దురదృష్టకరమైన విషయం!...

ఆమధ్య దేశపు రాజధానీ నగరంలో సంభవించిన రేప్ కేసూ, ఆ సందర్భంగా చెలరేగిన జాతీయ చర్చా గుర్తుకొచ్చాయి ధరణికి...రేపిస్టుకి ట్రయల్ లేకుండానే శిక్ష వేయాలని కొందరూ, మరణశిక్ష విధించాలని మరికొందరూ...ఎవరికి తోచిన విధంగా వారు సూచించారే తప్ప, అసలు సమస్యను గూర్చి కూలంకషంగా ఆలోచించే ప్రయత్నం ఎవరూ చేసినట్లనిపించదు. కొండవీటి చేంతాడంతటి లీగల్ ప్రోసెస్ తో కూడిన న్యాయవ్యవస్థలో ’డెత్ పెనాల్టీ’ అంటే అపరాథి స్కాట్ ఫ్రీగా తప్పించుకోవడమేననడంలో సందేహంలేదు. చట్టం తన పని పూర్తిచేసేలోపున నేరస్థుడు సమాజంలో పెద్దమనిషిలా చెలామణి అవుతూంటే, ఏ తప్పూ చేయని ’విక్టిమ్’ సంఘంచేత వెలివేయబడి, కన్నవారిచేత సైతం కాదనిపించుకుని, భవిష్యత్తును భస్మం చేసుకుని, జీవచ్ఛవంలా బ్రతకడం జరుగుతుంది.

నేరస్థుణ్ణి శిక్షించి చంకలు కొట్టుకున్నంతలో విక్టిమ్ కి న్యాయం జరిగిపోదు. ప్రభుత్వపు బాధ్యతా తీరిపోదు. ఆ అత్యాచారం మూలంగా స్త్రీకి ఆపాదింపబడే కళంకాన్ని చెరపడానికి, సమాజం యొక్క బూజుపట్టిన సిద్ధాంతాలను చెదరగొట్టడానికీ గట్టిగా కృషిచేయాలి. విక్టిమ్ కి మనోధైర్యాన్ని పెంపొందించి పునరావాసం కల్పించాలి. రేప్ అనే చర్య, దాన్ని చేసిన వ్యక్తి యొక్క బలహీనతగా పరిగణింపబడాలే తప్ప, అది అతని ’బలం’ గా గుర్తించకూడదు. రేప్ అనేది, దాన్ని చేసిన పురుషుడికి డిజడ్వాంటేజ్ అవ్వాలే తప్ప, దానికి గురైన స్త్రీకి కాదు. ’స్టిగ్మా’ రేపిస్టుకేగాని, విక్టిమ్ కి కాకూడదు. రేపిస్టుల వివరాలను ఫోటోలతో సహా విశేష ప్రచారానికి గురిచేసి ’అచ్చుపోసి వదలిన ఆబోతుల’ చందం చేయాలి. ఇతర హార్డ్ కోర్ క్రిమినల్స్ లాగే వారి హిస్టరీ షీట్స్ కూడా తయారుచేసి, వాళ్ళు తరచు పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ చేయవలసిందిగా నిర్దేశించాలి...అన్నిటినీ మించి రేప్ ని ఇతర నేరాలలా కాక, ఓ తీవ్ర సాంఘిక దురాచారంగా పరిగణించి...దాన్ని రూపుమాపడానికి ప్రజలూ, ప్రభుత్వమూ ఉమ్మడిగా ప్రత్యేక పద్ధతులలో ప్రయత్నించాలి. కేవలం చట్టాలు చేసినంతలో సామాజిక దురాచారాలు నిర్మూలం కాజాలవనీ, సమాజం యొక్క సహకారం అందుకు ఎంతైనా అవసరమని గుర్తించాలి. పబ్లిక్ ఎక్స్పోజర్ని గూర్చిన భయం దుండగులకు డిటరెంట్ గా పనిచేయగలదు. విక్టిమ్ కీ ఆత్మవిశ్వాసంతో రేపిస్టును ఎదుర్కోగల మనోబలమూ చేకూరుతుంది...

గండుతుమ్మెదల్లా రకరకాల ఆలోచనలు బుర్రలో ఝుమ్మంటూంటే గాఢ నిశ్వనం ఒకటి విడిచింది డాక్టర్ ధరణి. కాంత్ లాంటి యువకులు కొందరు చీకట్లో చిరుదివ్వెల్లా ఆశల వెలుగులను విరజిమ్మడం ఆమె మదికి కొంత ఊరట కలిగించింది.

"ఆంటీ!" నీలిమ పిలవడంతో తేరుకుని, "చెప్పమ్మా" అంది.

"కాంత్ అందించిన మనోధైర్యంతో, స్వాంతనతో మానసికంగా కోలుకుంటున్నాననుకుంటే ఈ మధ్యే బైటపడింది, నేను గర్భవతి నయ్యానన్న భయంకర సత్యం!" అంది నీలిమ. "ఆంటీ! ఆ దుర్మార్గుడి వంశాంకురం నా గర్భంలో పెరగడం నాకిష్టంలేదు. అందుకే అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. కాంత్ నా దురదృష్టాన్ని మన్నించి నన్ను పెళ్ళాడతానన్నంతలో ఓ కామోన్మాది బిడ్డకు అతన్ని తండ్రిని చేయలేను. తెలిస్తే ఈ బిడ్డకు తండ్రి అవడానిక్కూడా వెనుదీయడు కాంత్. అందుకే ఈ విషయం అతనికి చెప్పలేదు నేను".

కొద్ది క్షణాలు వారి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఆ పిల్ల మానసిక స్థితిని అర్థంచేసుకోవడానికి, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికీ ప్రయత్నిస్తోంది ధరణి. ఆమె పైన విపరీతమైన జాలి కలుగుతోంది. డాక్టర్ ఏం చెబుతుందా అని ఎదురుచూస్తోంది నీలిమ.

"నీలిమా!" నిశ్శబ్దాన్ని చీల్చుతూ అంది ధరణి. "నువ్వున్న పరిస్థితిలో ఏ ఆడపిల్లైనా ఇలా ఆలోచించడం సహజమే. ఐతే ఇప్పుడు నీకో కథ చెబుతాను. దాన్ని విన్నాక తుది నిర్ణయం తీసుకుందువుగాని..."

కథ అనేసరికి ఆసక్తిగా చూసింది నీలిమ.

#

లహరి అందమైన పిల్ల. ఫైనలియర్ ప్రొఫెషనల్ కోర్స్ చదువుతోంది. ఆస్తిపరులైన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఆమెకు ఓ మేనమామ ఉండేవాడు. ఏదో ఉద్యోగం చేసేవాడతను. లహరిని పెళ్ళాడాలని ఉవ్విళ్ళూరేవాడు. లహరికి మేనమామను చేసుకోవడం ఇష్టంలేదు. ప్రసాద్ అనే యువకుణ్ణి ప్రేమించిందామె. ఏదో బిజినెస్ చేసేవాడు అతను. చదువు ముగియగానే తల్లిదండ్రుల అనుమతితో అతన్ని వివాహమాడాలనుకుంది..." చెప్పుకుపోయింది డాక్టర్ ధరణి. "ఓసారి అమ్మమ్మను చూడ్డానికి వాళ్ళ ఊరికి వెళ్ళింది లహరి. ఓరాత్రి ఆ పిల్లకు పాలలో మత్తుమందు కలిపిచ్చి ఆమెను బలవంతంగా అనుభవించాడు మేనమామ. అందువల్ల ఆమె తప్పనిసరిగా తననే పెళ్ళాడుతుందన్న ఆలోచనతో ఆ పని చేసినట్టు ఒప్పుకున్నాడు అతను. మనవరాలు, ఆమె వెనుక ఉన్న గంపెడు ఆస్తీ బైటకు పోకూడదన్న ఉద్దేశ్యంతో అమ్మమ్మే ఆ సలహా ఇచ్చిందన్న చేదు నిజం తెలుసుకుని నిర్ఘాంతపోయింది లహరి..."

"మై గాడ్! అయినవాళ్ళే మోసం చేస్తే ఇక పరాయివాళ్ళ సంగతేమిటి!?" నిశ్చేష్ఠురాలయింది నీలిమ.

"స్వార్థం మనిషిని ఎంత పనైనా చేయిస్తుంది, నీలిమా!" అంది భరణి.

"ఐతే లహరి మేనమామనే పెళ్ళాడిందా?" కుతూహలంగా అడిగింది నీలిమ.

"లేదు. అలాంటి నికృష్టుణ్ణి పెళ్ళాడడంకంటె కన్నెగానే మిగిలిపోతానంది. ఐతే రెండు నెలల తరువాత కాని తెలిసిరాలేదు ఆమెకు, మేనమామ జరిపిన అత్యాచారపు ఫలితమేమిటో! తాను గర్భిణీ అని తెలియగానే అప్ సెట్ ఐనా, అందుకు కారకుడైనవాణ్ణి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. తన ప్రియుడైన ప్రసాద్ తో విషయమంతా దాచకుండా చెప్పేసి సలహా అడిగింది..." ఆగింది ధరణి. ఆతృతగా చూసింది నీలిమ.

"అంతవరకు ఆమె తన ఆరో ప్రాణం అన్న ప్రసాద్ - ముఖం చాటుచేయడం ఆరంభించాడు. ఓ రోజున నిలదీస్తే ఏమన్నాడో తెలుసా? ’జాంపండు ఇష్టంకదా అని చిలక్కొట్టుడును తినలేంగదా! ఎంగిలి పళ్ళకు దోసిలి పట్టేంత విశాల హృదయం నాకు లేదు. మీ మావయ్యనే చేసుకో’ అని సలహా ఇచ్చాడు...".

"ఓఁ, నో!" నీలిమ కీచుగా అరచింది.

"...ఈ సమాజంలో అధిక శాతం మగవాళ్ళు అంతే, నీలిమా! ప్రసాదూ సగటు మగాడే. నీ ప్రియుడిలాంటి వాళ్ళు ఎక్కడో ఒకటీ అరా ఉంటారంతే" అంది ధరణి. "లహరి బేల కాదు. ఎవరో చేసిన తప్పుకు కడుపులోని ప్రాణిని చంపడానికి ఇష్టపడలేదు. ధైర్యంగా బిడ్డను కని పెంచుతానంది. తాను పెళ్ళే చేసుకోనంది. ఆమె మనోభావాలను గౌరవించి అండగా నిలిచే తల్లిదండ్రులు దొరకడం ఆమె అదృష్టం..."

"ఐతే లహరి అసలు పెళ్ళే చేసుకోలేదా, ఆంటీ?" విస్మయంగా అడిగింది నీలిమ.

"లేదమ్మా. ధైర్యంగా పిల్లాణ్ణి కంది. ఆగిపోయిన చదువును కొనసాగించి పట్టా పుచ్చుకుంది. మనోస్థైర్యంతో కొడుకును పెంచి ప్రయోజకుణ్ణి చేసింది" అంది ధరణి.

ఓ క్షణం వారి మధ్య నిశ్శబ్దం ఆవరించుకుంది.

#

"లహరి కథ గుండె బరువెక్కిస్తోంది, ఆంటీ!" అంది నీలిమ కించిత్తు బాధగా.

"అది కథ కాదు నీలిమా, జీవితం!" అంది ధరణి. "కాంత్ వంటి ఉత్తముడు ప్రియుడిగా లభించినందుకు నువ్వు బిడ్డను కని సాకుతావో, లేక ఎబార్షన్ చేయించుకుని ఓ అమాయకపు ప్రాణాన్ని గుడ్డులోనే త్రుంచేస్తావో...బాగా ఆలోచించుకో. తుది నిర్ణయం నీదే!"

మర్నాడు నీలిమ వచ్చి, "నా సమస్యను కాంత్ తో పంచుకున్నాను, ఆంటీ! ఆ బిడ్డ మన బిడ్డ. అబార్షన్ అన్న ప్రసక్తే లేదు...అన్నాడు. రేపే వాళ్ళ పెద్దవాళ్ళతో విషయం చెప్పి మా పెళ్ళి గురించి మాట్లాడతానన్నారు డాడీ కూడాను. థాంక్ యూ సో మచ్!" అనేసరికి, అమందానందం పొందింది ధరణి.

"బెస్టాఫ్ లక్! మీ మేరేజ్ కి నన్ను పిలవడం మరచిపోకేం?" అంటూ ఆ పిల్ల నుదుటను ముద్దు పెట్టుకుంది.

#

"మమ్మీ! షి ఈజ్ నీలిమ..." అంటూ కొడుకు పరిచయం చేస్తూంటే, ఆ అమ్మాయి వంక చూసిందామె. అదే సమయంలో, "నమస్తే, ఆంటీ!" అంటూ చేతులు జోడించిన నీలిమ, ఆవిడ వదనంలోకి చూసి తెల్లబోయింది. "ఆంటీ! మీరా...!?" అంది.

"నీలిమా!?" అంది డాక్టర్ ధరణి కూడా ఆశ్చర్యంతో.

"మీరు...మీరు..." నీలిమకు మాటలు రావడంలేదు.

ధరణి మందహాసం చేసింది. "ఔనమ్మా. నేను శశికాంత్ తల్లిని" అంది. "చూసావా, జీవితం ఎంత చిత్రమైనదో! మళ్ళీ మనం ఇలా కలుస్తామనుకోలేదు కదూ? అనుకోనివి జరగడమూ, అనుకున్నవి జరక్కపోవడమేనేమో జీవితమంటే!"

ధరణి కొడుకు శశికాంత్ విస్తుపోతూ, "నీలిమ నీకు ముందే తెలుసా, మమ్మీ?!" అన్నాడు. మందహాసం చేసిందామె.

అంతలో తండ్రి లోపలికి రావడంతో, "ఆంటీ! ఈయన మా డాడీ...దుర్గప్రసాద్" అంటూ పరిచయం చేసింది నీలిమ. "నమస్తే!" అంటూ అతనివైపు చూసిన ధరణి చిన్నగా ఉలికిపడింది.

"లహరీ! నువ్వా..!?" అన్నాడతను నిర్ఘాంతపోతూ. యాభై ఏళ్ళుంటాయి అతనికి.

ధరణి కూడా తెల్లబోతూ, "ప్రసాద్! నువ్వేనా!?" అంది. "నీలిమ నీ కూతురా!?"

జవాబుగా తల దించుకున్నాడు దుర్గాప్రసాద్.

"హుఁ, విధివిలాసం కాకపోతే ఇన్నేళ్ళ తరువాత మనం మళ్ళీ ఇలా కలుసుకుంటామనుకోలేదు కదూ?" శుష్కహాసం చేసింది ధరణి.

"ఆంటీ! మా డాడీ మీకు ముందే తెలుసా?" నీలిమ ఆశ్చర్యంగా అడిగింది. "మీ పేరు...?"

"ఎస్, బేబీ! నా పూర్తి పేరు ధరణీలహరి" ఆమె భావం గ్రహించి, అంది ధరణి.

"ఐతే మీరు చెప్పిన కథలోని లహరి...మీరే కదూ?" ఉద్వేగానికి గురైంది ఆ పిల్ల.

చిన్నగా తలూపింది ధరణి.

"మిమ్మల్ని కాదన్న ఆ ప్రసాద్...మా డాడీయే కదూ?" అడుగుతూంటే ఆ పిల్ల అధరాలు సన్నగా కంపించాయి. జీవంలేని చిరునవ్వు జవాబయింది ఆమెకు.

"నన్ను క్షమించు, లహరీ! ఏదో తెలిసీ తెలియని వయసులో అలా జరిగిపోయింది," అపాలజెటిక్ గా అన్నాడు నీలిమ తండ్రి. "అదంతా మనసులో పెట్టుకుని నా కూతురికి అన్యాయం చెయ్యకు".

"నో!" అరచింది నీలిమ. "పద డాడీ, వెళ్ళిపోదాం" అంటూ గుమ్మం వైపు తిరిగింది. తెల్లబోయి చూసారంతా.

"నీలిమా! ఏమయిందమ్మా?" అనడిగింది ధరణి, ఆ పిల్ల చేయి పట్టుకుని ఆపుతూ.

"వద్దు ఆంటీ! ప్రేమించిన పడతిని వంచించిన ఓ అవకాశవాది కూతురిగా నేను మీ దయకు పాత్రురాలిని కాను. చరిత్ర పునరావృతం కావడమంటే ఇదే కాబోలు! ఆనాడు ఈయన మీకు విధించిన శిక్షను ఈనాడు తన కూతురు కూడా అనుభవిస్తే తప్ప తెలిసిరాదు" తండ్రి వంక అసహ్యంగా చూస్తూ ఆవేశంగా అందామె. "బేబీ...!" తెల్లబోయాడు తండ్రి.

"ప్రసాద్! ఆరోజు నేనున్న పరిస్థితిలో ఈరోజు నీ కూతురుంది. తప్పు తనది కాకపోయినా, నిస్సహాయ స్థితిలో తనకు జరిగిన అవమానం భరించలేక నీలిమ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అదే జరిగితే నువ్వు, నీ భార్య ఏమైపోయి ఉండేవారు?" శాంతంగా అంది ధరణి.

ఆందోళనగా కూతురివంక చూసాడు దుర్గాప్రసాద్. అతని వదనంలో బాధ ద్యోతకమయింది.

"నీ వరకు వస్తే కాని ఆ నరకం ఏమిటో బోధపడలేదు కదూ నీకు?...ప్రసాద్! ఓ నిజం చెప్పనా? మా మావయ్య నా శరీరం మీద చేసిన దాడి కంటె, నీ తిరస్కారం చేసిన మానసిక గాయమే అమితంగా కృంగదీసింది నన్ను. నన్ను దక్కించుకోవాలన్న తపనతో మా మావయ్య నాపైన అత్యాచారం జరపడం అర్థం చేసుకోగలను. కాని, ప్రాణప్రదంగా ప్రేమించిన, నా అనుకున్న వ్యక్తి తిరస్కారానికి గురికావడం ఊహకందని విషయం. రేపిస్ట్ ఉన్మాదం చేసే గాయం కొద్ది రోజుల్లో మాసిపోవచ్చును. కాని, చుట్టూ ఉన్నవారు చేసే మానసిక గాయాలే మాయని గాయాలై జీవితాంతమూ మిగిలిపోతాయి, వేధిస్తాయి.”

"ప్లీజ్, లహరీ! అదంతా మనసులో పెట్టుకోకు. నీలిమ అమాయకురాలు..."

"...ఆడపిల్ల ఎప్పుడూ అమాయకురాలే, ప్రసాద్!" మధ్యలోనే అడ్డుతగిలిందామె. "కన్నవారు, ప్రేమించినవారు, లేదా కట్టుకున్నవాడు, సానుభూతితో ఆమె దుస్థితిని అర్థం చేసుకుని చేయూతనిస్తే చేదు అనుభవాన్ని మరచిపోయి నూతన జీవితాన్ని ఆరంభించగలుగుతుందామె. అలా కాని నాడు, ఆమె జీవితం కుక్కలు చింపిన విస్తరే అవుతుంది..."

"మీ అబ్బాయికి నీలిమ అంతా చెప్పిందట. పెద్దమనసుతో ఆమెను పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకున్నాడట" అర్థింపుగా అన్నాడు దుర్గాప్రసాద్.

"ఔను. శశి నా పెంపకంలో పెరిగిన ఉన్నత సంస్కారి. అందుకే నీలిమ జీవితం నిలబడింది. అదే నీలాంటి వాడైతే, ఆమె బ్రతుకు ఏమయ్యేదో ఓ క్షణం ఆలోచించు" అంది ధరణి.

లజ్జతో తల వంచుకున్నాడు అతను.

’గతాన్ని మనసులో పెట్టుకుని నీ కూతురికి అన్యాయం చెయ్యొద్దన్నావు కదూ? తండ్రి చేసిన తప్పుకు కూతురెలా బాధ్యురాలవుతుంది? నీ మీద కోపంతో నీలిమను శిక్షించేంతటి కుసంస్కారం మాకు లేదు, ప్రసాద్!" అన్న ధరణికి చేతులెత్తి నమస్కరించాడు దుర్గాప్రసాద్, కళ్ళలో కృతజ్ఞతతో కూడిన కన్నీళ్ళు తొణికిసలాడుతూంటే.

"ఆంటీ!" అంటూ వచ్చి కాళ్ళకు నమస్కరిచబోయిన నీలిమను ఆపి అక్కున చేర్చుకుని, ఆమె కన్నుల్లోంచి జాలువారుతూన్న అశ్రువులను కొనగోట తుడిచింది డాక్టర్ ధరణి.


  • (జాగృతి వారపత్రిక, 10-3-2014)
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.