తస్మాత్ జాగ్రత్త

పి.యస్.యమ్. లక్ష్మి

“ఏమండీ, ఆ అబ్బాయిమళ్ళీ వచ్చాడు” లక్ష్మి నిద్రపోతున్న వెంకట్ ని లేపింది.

“ఏ అబ్బాయే. సెలవు రోజు హాయిగా పడుకోనివ్వవు. నువ్వే ఏదో చెప్పు” బద్దకంగా అటు తిరిగి పడుకున్నాడు వెంకట్.

“నేను చెబితే మళ్ళీ మళ్లీ వస్తున్నాడనేకదా మిమ్మల్ని చూడమంది” ఒకసారి లేవండీ లక్ష్మి పట్టు.

ఇంక తప్పదని లేచి బయటకొచ్చాడు వెంకట్. అక్కడ ఎవరూ లేరు.

“ఎక్కడే”

“ఇప్పుడిక్కడే నుంచున్నాడు. మీ అలికిడి విని వెళ్ళిపోయాడేమో. రోజూ ఇంతేనండీ. సుధ గురించి అడుగుతాడు, వాళ్ళు విచ్చలవిడిగా తిరిగినదాని గురించి చెబుతాడుగానీ నేనేం చెప్పినా సరిగా వినకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ రావద్దని చెప్పినా వినకుండా వస్తాడు. ఇవ్వన్నీ చూస్తుంటే వాడేదో కావాలనే చేస్తున్నాడనిపిస్తోంది.”

నిద్ర తేలిపోయిన వెంకట్ తీరిగ్గా భార్యతో చర్చించటానికి కూర్చున్నాడు. “ ఒక్కసారి కేసు మళ్ళీ వివరంగా చెప్పు” అంటూ.

“అబ్బో లాయరులాగాపోజు కొడుతున్నారే” నవ్వింది లక్ష్మి తనూ కూచుంటూ.

“లాయరు కాదోయ్. లాయరవతారమెత్తితే కోర్టులూ గొడవలూ. నేనిప్పుడు డిటెక్టివ్ ని. కేసు వెంటనే తేల్చేస్తాను. వివరాలన్నీ చెప్పు”.

“ఆ ఆబ్బాయి 4, 5 రోజులనుంచీ రోజూ వస్తున్నాడండీ. ఒక్కో రోజు ఒక్కో టైముకి వస్తాడు. సుధ కావాలంటాడు. సుధ ఉద్యోగం చేస్తోందికదా పగలు ఇంట్లో వుండదు. సాయంకాలమో, సెలవురోజో రమ్మని చెప్పినా వినటంలేదు. ఆ అమ్మాయి ఆఫీసుకెళ్ళాకే వస్తాడు. పైగా నన్నిప్పుడు రమ్మంది, గండిపేట వెళ్దామన్నది అని ఒక రోజు ఇంకెక్కడికో వెళ్దామన్నదని ఇంకో రోజు, రోజుకో విధంగా చెబుతాడు. పేరు కృష్ణ అని చెప్పాడు.”

“సుధకి చెప్పావా ఈ సంగతి?”

“చెప్పాను. ఆ అమ్మాయేమో అతనెవరో తనకి తెలియదు అని ఖచ్చితంగా చెబుతోంది. పైగా తనకి తెలిసినవాళ్ళకి తనేటైములో ఇంట్లో వుంటానో తెలుసు, ఆ సమయంలోనే వస్తారుగానీ లేని సమయంలో రారంటుంది. ఇంకా తన వాళ్ళందరూ మనకీ తెలుసని కొత్తవాళ్లెవరూ రారు అని ఖచ్చితంగా చెబుతోంది. రోజూ వస్తున్నాడనేసరికి భయపడుతోంది పిచ్చిపిల్ల.”

సుధ ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చి మా ఇంట్లో అద్దెకుంటోంది. ఒక్కతే వుండటంవల్ల మా ఆవిడతో బాగా కలిసిపోయింది. మంచి అమ్మాయి. ఎప్పుడన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వెళ్ళటంతప్ప ఆ అమ్మాయికోసం ఎవరూ రారు. ఏడాదిపైనుంచి వున్నా సుధవల్ల మాకే చిన్న ఇబ్బందికూడా లేదు. ఈ కృష్ణ అనే అబ్బాయి చూస్తే ఆకతాయిలాగా వున్నాడు. లేకపోతే కావాలని ఆ అమ్మాయి లేనప్పుడు రావటమేమిటి. స్నేహితుడిలాగా వస్తే ఆ అమ్మాయి వున్నప్పుడే రావచ్చుగా… “ అంటే .. లక్ష్మీ, నీకు జరిగినట్లే ఇదికూడానంటావా?”

“నాకూ అదే అనుమానేం వస్తోందండీ” .. ఇద్దరం జాయింట్ గా రింగులు వేసుకుంటూ మా పెళ్ళికాకముందు రోజులకి వెళ్ళిపోయాము.

లక్ష్మి ఉద్యోగంకోసం ఈ ఊరు వచ్చినప్పుడు తనూ వాళ్ళ స్నేహితురాలు సుమతి ఒక గది అద్దెకు తీసుకుని వుండేవాళ్ళు. ఆ సమయంలోనే నా పరిచయం, మా ఇద్దరిమధ్యా ఇష్టం పెరగటం, పెళ్ళి చేసుకుందామనుకోవటందాకా వెళ్ళింది. నేను అప్పుడప్పుడూ సెలవు రోజుల్లో వాళ్ళ రూమ్ కి వెళ్ళి కొంచెం సేపు కూర్చునేవాడిని. లక్ష్మి విడి రోజుల్లో రానిచ్చేదికాదు. మేము ఒకే ఆఫీసులో పని చేసేవాళ్ళంకనుక రోజూ ఆఫీసులో కలుస్తూండేవాళ్ళం. లక్ష్మి సాంప్రదాయాల్లో పెరిగిన పిల్ల. లక్ష్మే ఏమిటి మేముకూడా. అందుకే చెడ్డ పేరు తెచ్చుకోవటం మాకిద్దరికీ ఇష్టంలేదు. పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి వుండాలనుకునే ప్రేమేకానీ నాలుగు రోజుల ప్రేమకాదు. నేను వాళ్ళింటికికూడా ఎక్కువ వెళ్ళేవాడినికాదు, వాళ్ళ ఇంటిగలవాళ్ళు ఏమన్నా అనుకుంటారని. కానీ ..

లక్ష్మి ఆలోచనలు గతంలో చాలా దూరం వెళ్ళాయి. తనూ వెంకట్ ఒకరంటే ఒకరికి అభిమానమున్నా ఎంత జాగ్రత్తగా వుండేవాళ్ళం. తల్లిదండ్రులు తనమీద నమ్మకంతో ఒక్కదాన్నీ ఇంత దూరం పంపించారు. వాళ్ళకి చెడ్డ పేరు తేకూడదు. అదే తన ధ్యేయం.అందుకే వెంకట్ ని కూడా ఇంటికి ఎక్కువ రానిచ్చేది కాదు. బయటకూడా అతనితో తిరిగేది కాదు. కేవలం ఆఫీసులోనే మాట్లాడుకునేవాళ్ళు. తనంత జాగ్రత్తగా వుంటే ఒక రోజు ఇంటికి రాంగానే ఇంటిగలావిడ చెప్పింది “నీకోసమెవరో రాజుట వచ్చాడు” అని. ఆశ్చర్య పోయింది. నాకా పేరుతో ఎవరూ తెలియదని చెప్పింది.

మర్నాడు ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంటిగలావిడ వాకిట్లోనే ప్రత్యక్షం. ఆ రాజు మళ్ళీ వచ్చాడు. అయినా నువ్వున్న సమయంలో రమ్మనచ్చుగా. నువ్వులేనప్పుడు వచ్చి మమ్మల్ని విసిగించటం ఎందుకు కొంచెం చికాగ్గానే అన్నది.

నాకతనెవరో తెలియదు ఆంటీ. నాకోసం వచ్చేవాళ్ళయితే నేనుండే సమయంలోనే వస్తాడు. అసలు రావద్దని చెప్పెయ్యండి. నాకేం అభ్యంతరం లేదు. అని విసురుగా లోపలకొచ్చేసింది. అసలే ఇంటిగలావిడకి ఆడపిల్లలొక్కళ్ళే వుంటున్నారని అనేక అనుమానాలు. ఎప్పుడూ వెయ్యి కళ్ళతో పరీక్షిస్తూనే వుంటుంది. ఈ రాజెవరు. ఆ పేరుతో తనకెవరూ తెలియదే. రోజూ నేను లేని సమయంలోనే ఎందుకొస్తున్నాడు. తెలిసినవాళ్ళయితే వుండే సమయం కనుక్కుని వస్తారుకదా. ఎందుకైనా మంచిదని వెంకట్ కి విషయం చెప్పింది. అతను రాజుని ఆఫీసుకి రమ్మని చెప్పమన్నాడు. అదీ బాగానే వుంది ఎవరో చూడచ్చనుకుంది.

మర్నాడు ఇంటికి వెళ్ళేసరికి రెడీగా ఇంటిగలావిడ. చాలాసేపునుంచి ఎదురు చూస్తున్నట్లుంది. చూడగానే మొదలు పెట్టింది. “ఏంటమ్మాయ్ మాఇంట్లోనూ ఆడపిల్లలున్నారు. ఇట్లా జులాయి వెధవలు రోజూ ఇంటికొస్తే మా పరువేంగాను? అర్జంటుగా ఇల్లు ఖాళీ చెయ్యి”. అని ఝాడించేసింది.

అతనెవరో నాకు తెలియదంటే మీరు వినిపించుకోవటంలేదు..మీరతన్ని ఇంటికి రావద్దని ఖచ్చితంగా చెప్పండి. ఈమారొస్తే మా ఆఫీసుకు రమ్మనండి. అని లోపలకెళ్ళి తలుపేసుకుందేగానీ కొన్ని రోజులుగా అనుభవిస్తున్న ఆందోళన ఇంకా పెరిగింది. ఏమీటీ గోల వాడెవడో తనకి తెలియదు. ఇంకెవరి బదులో తన ఇంటికి వస్తున్నాడేమో అనుకుంటే ఆఫీసు వివరాలన్నీ సరిగ్గానే చెబుతున్నాడుట. ఆఫీసుకెళ్ళమంటే ఇంటికే రమ్మన్నది, సరదాగా గడుపుదామన్నది అని ఇంటిగలావిడకి చెడ్డ అభిప్రాయమొచ్చేటట్లు రోజూ నానా వాగుడూ వాగుతున్నాడని చెప్పింది. ఆవిడమాత్రం ఎన్నాళ్ళు భరిస్తుంది. ఇలాంటి విషయాలు ఎవరికి చెబుతాము. రూమ్మేట్ ఊళ్ళో లేదు. అన్నీ చూసుకునే వస్తున్నట్లున్నాడు. వెంకట్ కి చెబుదామంటే మర్నాడుదాకా ఆగాలి. అప్పట్లో ఇప్పుడున్నట్లు ఫోన్లు లేవుగా. తన తప్పేమీ లేకుండా నరకం అనుభవించింది కొన్నాళ్లు.

మర్నాడు ఆఫీసుకొస్తాడేమోనని చూశారు. అప్పుడే కాదు మళ్ళీ ఎప్పుడూ ఇంటికిగానీ, ఆఫీసుకిగానీ రాలేదు. కొన్నాళ్ళు అవ్వే ఆలోచనలతో సతమతమయ్యి నెమ్మదిగా దైనందిక జీవితంలో వాటిని మరచిపోయారు. తర్వాత తెలిసింది. తన స్నేహితురాలు కవిత కోటీ తాజ్ మహల్ హోటల్ కి వెళ్తే తను అంతకుముందు పని చేసిన ఆఫీసులోని రంగారావు అక్కడ పక్క టేబుల్ దగ్గర ఇంకెవరితోనో కూర్చుని కనిపించాడుట. వాళ్ళ మాటలుబట్టి వాడికి తను లొంగలేదని కావాలనే తనని అల్లరి పెట్టాలని అలా చేయించానని గొప్పగా చెబుతున్నాడుట. నిజంగా నిన్నంత గోల పెట్టాడా అని అప్పుడు అడిగింది. దానితో తెలిసింది తమకి అసలు సంగతి.

అసలీ మొగవాళ్ళేమనుకుంటారు? ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటే చౌకబారు రకాలనుకుంటారా? వాళ్ళు చదువుకుని ధైర్యంగా ఉద్యోగాలకి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఆలోచనలుండవా? వాళ్ళకి వ్యక్తిత్వాలుండవా? వాళ్ళు మనుష్యులుకాదా? ఏ మగాడు కనబడితే వాడి వెనక వెళ్ళిపోయేంత లూజ్ కేరక్టర్సా? అసలలాంటి అవసరం వాళ్ళకెందుకొస్తుందనికూడా ఆలోచించరా? అని బాధ పడింది. వాడెన్ని వేషాలేసినా మర్యాదగా తప్పుకుందేగానీ, వాడిని రెచ్చగొట్టేటట్లు కాదుకదా కనీసం ఎక్కువ మాట్లాడేది కూడా కాదు. అదికూడా వాడికి కోపంట. అందరితో మాట్లాడి తనతో ఎందుకు మాట్లాడదని? ఎందుకు మాట్లాడదంటే అందరూ ఆఫీసులో ఒక ఉద్యోగినిలా మాట్లాడేవాళ్ళు, అందుకే వాళ్ళతో మాట్లాడటానికి ఇబ్బంది పడేదికాదు. కానీ వీడు .. వీడి మాటలు, చేష్టలు, చూపులు అసహ్యంగా వుండేవి. అందుకే తన జాగ్రత్తలో తనుండేది. అది వాడికి నచ్చలేదు. అయితే తనేం చేస్తుంది. వాడికోసం తన బతుకు బండలు చేసుకోదుకదా. అలా చేసుకుంటే నాన్న చెప్పించిన చదువుకి, నేర్పిన సభ్యతకి విలువ ఏమిటి? రంగారావు కనబడితే ఎక్కడ కనబడితే అక్కడ చెప్పు తీసుకు తన్ని అన్నీ అడగాలనుకుంది. ఆ నరకం నుంచి బయట పడేసినవాడు వెంకట్. నాన్న దాకా వ్యవహారం వెళ్ళకుండా అహర్నిశలూ తనకి తెలియకుండానే తనని కనిబెట్టుకని వుండి నిజమైన స్నేహితుడనిపించాడు.

ఈ సంగతి జరిగి 15 ఏళ్ళు దాటింది. తర్వాత తమ పెళ్ళి, సంసారం, బాధ్యతలు .. మరుగున పడిన పాత విషయాలు మళ్ళీ ఇవాళ బయటకొచ్చాయి. మళ్ళీ అవ్వే సంఘటనలు. రోజులు మారినా, స్త్రీలు ఎంత అభివృధ్ధిచెందినా, కొందరు మగవాళ్ళ ఈ కుళ్ళు బుధ్ధులు మారలేదా అనిపించింది. ఇదివరకు అంత నరకం అనుభవించి వున్నాను కనుక సుధని అలాంటి బాధ పడనివ్వదల్చుకోలేదు. వాళ్ళ అమ్మా నాన్నా దగ్గర లేకపోతే ఏం దగ్గరున్న మేము మనుష్యులమేగా.

అందుకే సుధ ఇంటికి వచ్చాక నెమ్మదిగా అడిగాను మళ్ళీ. ఏంటమ్మా ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు. ఏం చెప్పమంటావ్ అని. వదినా నాకు నిజంగా ఆ పేరుతో ఎవరూ తెలియదు. అయితే మీరింతగా అడగుతున్నారుగనుక ఈ మధ్య జరిగిన సంఘటనకీ దీనికీ ఏమైనా సంబంధం వుందేమో చూడండి. ఒక పది రోజుల నుంచీ రోజూ ఒకతను నన్ను ఆఫీసుకి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పడూ వెంబడిస్తున్నాడు. ఏవేవో వాగుతున్నాడు. నేను పట్టించుకోకుండా పోతున్నాను. అతన్ని చూస్తే రౌడీ లాగా వున్నాడు. తనని పెళ్ళి చేసుకోకపోతే ఇంకెవర్నీ చేసుకోనివ్వననీ, నన్ను అన్ని విధాలా బద్నామ్ చేస్తాననీ బెదిరిస్తాడు కూడా. నేనింత మటుకూ వాడేదో వాగుతున్నాడులే అని నాదోవన నేను పోతున్నాను.

సుధకి ఈ విషయంలో అబధ్ధం చెప్పే అవసరం లేదు. అందుకే మేమే ఒక నిర్ణయానికి వచ్చాము. మర్నాడు సుధ మామూలుగా ఆఫీసుకి వెళ్ళిపోయింది. నేను ఆఫీసుకి వెళ్ళినట్లు వెళ్ళి స్కూటర్ ఫ్రెండ్ ఇంట్లో పార్కు చేసి తిరిగి ఇంటికి వచ్చాను. 12 గంల సమయంలో కాలింగ్ బెల్ మోగింది. లక్ష్మి వెళ్ళి తలుపు తీసింది. ఆ అబ్బాయే.

“ఏం బాబూ, ఈ సమయంలో సుధ ఇంట్లో వుండదు అని చెప్పాను కదా..పోనీ ఆఫీసుకెళ్ళలేక పోయావా అంత అర్జంటుగా మాట్లాడాలంటే.” లక్ష్మి మాటలు వినబడ్డాయి.

“లేదండీ. తనివాళ తప్పకుండా ఇంట్లో వుంటాను సెలవు పెడతాను రమ్మని చెప్పింది. అందుకే వచ్చాను. వేరే అర్జంటు పనేమీ లేదండీ. కొంచెం సేపు సరదాగా గడుపుదామని” నసిగాడా ఆ అబ్బాయి.

“ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో సరదాగా గడుపుదామన్నదా!? మరి మాతో నువ్వెవరో తెలియదందే!!” లక్ష్మి ఏమీ తెలియనట్లే మాట్లాడుతోంది.

“తనంతేనండీ. ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఇంతకు ముందు మా ఫ్రెండుతోనూ ఇలాగే గడిపిందిలెండి. సర్లెండి నా అదృష్టం బాగాలేదు. రేపొస్తానని చెప్పండి” వెళ్ళిపోయాడా అబ్బాయి.

నేనూ వెనకాలే వెళ్ళాను. నా స్నేహితులింకో ఇద్దరు సందు చివర వుండి నన్ను చూసీ చూడనట్లే వున్నారు. ఇదంతా మేము ముందుగా వేసుకున్న ప్లాను మరి. ఆ అబ్బాయి సరాసరి సందు చివర బైక్ మీద కూర్చున్న ఇంకొకడి దగ్గరకెళ్ళి మాట్లాడాడు. అతను ఇతనికి డబ్బులిచ్చి బైక్ స్టార్ట్ చెయ్యబోయాడు. నేను చెయ్యనిస్తేనా..అడ్డు పడ్డాను. సుధని వెంబడిస్తున్న ప్రేమికుడు అతనే అనిపించింది. నేను వాళ్ళిద్దరినీ పట్టుకోవటం చూసి నా స్నేహితులిద్దరూ వెంటనే వచ్చారు నా సహాయానికి.

బైక్ అతనిని అడిగాను నేను “ఏమిటి సార్? మా సుధ మీకు ముందునుంచీ తెలుసా? ఇంటికి రండి మాట్లాడుకుందాం. సుధని కూడా పిలిపిస్తాను.” మర్యాదగా అడిగాను.

“మీరు?” అతను బెదిరి పోయాడు

“సుధా వాళ్ళ అన్నయ్యను.”

“సుధకి అన్నయ్యలు లేరు. మీరు వాళ్ళ హౌస్ ఓనరా?” అతని గొంతులో కొంచెం భయం.

“ఏం హౌస్ ఓనర్ లు అన్నయ్యలు కాకూడదా? నేను హౌస్ ఓనర్ అన్నయ్యను. ఇంతకీ ఏమిటి సుధని పెళ్ళి చేసుకుంటారా? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రండి.” ఇంటి వైపు తీసుకెళ్ళబోయాము.

“వద్దులెండి. ఇంకోసారి వస్తాను. నాక్కొంచెం అర్జంటు పని వుంది.” జారుకో బోయాడు. ఇంటికొచ్చిన అబ్బాయైతే ముందే జారుకోబోయాడు. మేము వదిలితేనేగా.

“సరే మీకర్జంటు పని వుందన్నారుగా..ఇక్కడే మాట్లాటతాం. మా సుధ యమ్.యస్ చేసింది. మీరేం చదువుకున్నారు? తను మంచి ఉద్యోగం చేస్తోంది. మీరేం ఉద్యోగం చేస్తున్నారు? మరి పెళ్ళిగురించి మాట్లాడేటప్పుడు అమ్మాయికన్నా అబ్బాయి అన్ని విధాలా ఉన్నతంగా వుండాలని ఆలోచిస్తాంకదా! మీ వివరాలు కాస్త చెబితే వాళ్ళ పేరెంట్స్ కి కబురు పెడతాను.”

చదువూ, ఉద్యోగం అడిగేసరికి వాడి కంగారు ఇంకా ఎక్కువైంది. చదువుకుని, ఉద్యోగం చేసేవాళ్ళకి ఎక్కడో రంగారావులాంటి వాడికి తప్ప ఇలా ప్రవర్తించాల్సిన అవసరం వుండదుకదా.

రౌడీలాగా ఆడపిల్లని బెదిరించినా, వాడి భయాలు వాడికున్నాయి. అందుకే కాళ్ళబేరానికి వచ్చేశాడు. ఇంటికొచ్చిన అబ్బాయైతే అతని ముందే అతనిచ్చిన డబ్బు అతనికిచ్చేసి సార్ నేనేదో డబ్బుకాశపడి అతను చెయ్యమన్నట్లు చేశాను. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. ఆ సుధ ఎవరో నాకసలు తెలియదు. ఆవిడని నేనెప్పడూ చూడలేదు, మాట్లాడలేదు. మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యను. నేను స్టూడెంటుని నన్నొదిలెయ్యండని బతిమాలుకుని జారిపోయాడు.

ఆ అబ్బాయి జారుకోగానే బైక్ వీరుడు కూడా జారుకోవటానికి ప్రయత్నించాడు. “ఇంకెప్పుడూ సుధ జోలికేకాదు ఇంకే అమ్మాయి జోలికీ వెళ్ళను, క్షమించండి” అని కాళ్ళబేరానికి వచ్చాడు.

“ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే నీతో మేము మాట్లాడం, నేరుగా పోలీసులొస్తారు. మొదటిసారికదా అని వదిలేస్తున్నాం జాగ్రత్త” అని చెప్పి వాడిని వదిలేసి వెనక్కి తిరిగాము.

లక్ష్మి పడ్డ నరకం సుధ పడకుండా తప్పించానుకదా అని సంతోషంతో మా ఫ్రెండ్స్ కి కృతజ్ఞతలు చెప్పి, లక్ష్మికి ఈ వార్తలు చెప్పాలని హుషారుగా ఇంటికి నడిచాను.

అన్నట్లు ఇలాంటి వాళ్ళు మీకూ ఎక్కడన్నా ఎదురు పడచ్చు. తస్మాత్ జాగ్రత్త!!


(ఆంధ్రప్రభ.కాం ఇ పేపర్ లో 25-5-2014న ప్రచురించబడీంది.)

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.