విలువైన మాట

* కాళహస్తి కి సమీపంలో గల అటవీ ప్రాంతంలో ఓ చోట వటవృక్షం
విశాలమైన శాఖలతో భూమికి పట్టిన పచ్చని గొడుగులా ఉంది. ఆ చెట్టు కిందకి సూర్యస్తమయ సమయానికి పక్షులన్నీ చేరేవి. మాటామంతీ ఆడుకుంటూ ముచ్చట్లు చెప్పుకొనేవి.ఓ రోజు చెట్టు చాటునుండి"తిన్నడు"అనే బోయవాడు ఇదంతా గమనించాడు. ఒక్కసారిగా ఎక్కువ పక్షులు దొరికే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ వాటిని పట్టేందుకు పధకం వేసుకున్నాడు.ఓరోజు మధ్యాహ్నం చెట్టుకింద వలపన్ని నూకలుజల్లి వెళ్ళిపోయాడు.
మరునాడు ఉదయం వేటగాడు వచ్చేసరికి వలలో పిచ్చుక,నెమలి ,కోకిల,చిలుక చిక్కుకొని ఉన్నాయి. అవి ఎంత గింజుకున్నా తప్పించుకోలేక పోయాయి.నెమలి ముందుగా ధైర్యం తెచ్చుకుని బోయివానితో ఇలా అంది "ఓ కరుణామయా"!నేను చక్కని నృత్యంతో నీకు కనువిందుచేస్తాను. నన్ను కనికరించి ప్రాణభిక్ష పెట్టమంటూ వేడుకుంది.వేటగాడు వలనుంచి నెమలినితప్పించగనే, కోకిలకు కొండంత ధైర్యం వచ్చింది. "ఉపాయం దొరికితే ఊర్లు ఏలనా? అన్నట్టు కుహూ...కుహూ...అంటూ కూనిరాగంతీస్తూ,నెమలిఆటకు నాపాట సరిజోడవుతుంది, నన్నుకూడా విడిచిపెట్టవయ్యా బాబూ అంటూ వేడుకుంది.కోకిలను వలనుండి తప్పించాడు బోయవాడు.చిలుకలో ఆశలు చిగురించాయి.ఆపాటకు 'గమకాలు'పలుకుతాను నా పలుకులు'పంచదార గుళికలు' నన్నుకూడా విడిచిపెట్టవయ్యా నీకు పుణ్యం ఉంటుంది.అంతేకాదయ్యా దోరపండిన జాంపండు దొరికినప్పుడల్లా నీకే ఇస్తాలే అంటూ బతిమిలాడింది.వేటగాడు సరేనని చిలుకనుకూడా విడిచిపెట్టాడు.
పిచ్చుకకు పై పక్షుల్లా ఏ విద్యలూరావు.ఎలా తప్పించుకోవాలో తెలియక బిక్కచచ్చిపోయింది.బేలగాచూస్తున్న పిచ్చుకను చూసి 'మరినీసంగతేంటి?'అంటూ ఎగతాళిగా పలకరించాడు.'దొరా నవ్వు నన్ను తినాలనుకున్నా నీ పంటికిందకురాను.నన్ను చంపుకుతింటే నీ కడుపు నిండుతుందటయ్యా?' నన్ను విడిచిపెట్టు కొన్ని మంచిమాటలు చెబుతానంటూ కన్నీటితో వేడుకుంది.అయితే చెప్పుమరి నీ సోది అనగానే ప్రాణంలేచొచ్చినట్లై ఊపిరిపీల్చుకుని ఇలా చెప్పడం ప్రారంభించింది.మొదటిమాట వినినంతనే ఎవరిమాటనైనా గుడ్డిగా నమ్మేయకు!ఇక రెండవది సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా తొందరపడి ముందుకు దూకేయకు.మూడవది ప్రాణంపోతుందన్నా సరే ఇచ్చినమాట నిలబెట్టుకో!"ఇవే ఆణిముత్యల్లాంటి నా మాటలు. చిన్నదాన్నని చిన్న చూపు చూడకు అనగానే, తిన్నడు ఫక్కున నవ్వి"జానెడంతలేవు జాణమాటలేల?ఛాల్లే...పో...పో..అంటూ వలలోంచితీసి విసిరేసాడు మూడుఫల్టీలుకొట్టి ఎగిరిచెట్టెక్కి కూర్చుంది.కిచ...కిచ...కిచమంటూ నవ్వడమతో తిన్నడికి తిక్కరేగింది.పక్కనున్న రాయితీసి విసిరాడు.గురితప్పింది."ఆగు మిత్రమా ఆవేశం వద్దు.నీ దయవలన నాకు ప్రాణగండం తప్పిందనే సంతోషంతో చేసిన శబ్ధమది.మరోలాభావించకు నన్ను వదలక ఇంటికితీసుకువెళ్ళి కోసుకున్నట్లైతే నా బానకడుపులో దాచుకున్న వజ్రం నీకుదక్కేది అటువంటి భాగ్యాన్ని వదులుకుని నాకు ప్రాణదానం చేసిన నీకు ప్రత్యుపకారం ఎలా చెయ్యాలో అని ఆలోచిస్తున్నానంది పిచ్చుక.
"వజ్రం"ఆ మాట వినగానే తిన్నడి మతిచలించింది.చేతికి అందొచ్చిన అదృష్టాన్ని చేజేతులా విడుచుకున్నందుకు బాధకలిగింది.
ఎలాగైనా పిచ్చుకని పట్టుకొని వజ్రం సంపాదించాలనుకొని గబగబా చెట్టు ఎక్కబోయి జారిపడ్డాడు.అదిచూసి నవ్వుతూ పిచ్చిక ఇలా అంది. మిత్రమా నేచెప్పిననీతులు విననందుకే నీకీపాట్లు వచ్చాయి. నా కడుపులో వజ్రం ఉందన్న మాట విని అత్యాశకుపోయావు. నిజానికి ఏ పక్షికడుపులోనూ వజ్రం ఉండదన్న ఆలోచన నీకు రాలేదు.
అందుకే వినినంతనే ఎవ్వరిమాటలు గుడ్డిగా నమ్మేయవద్దు అన్నది.ఇక సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ముందుకు దూకేయవద్దన్నా చెట్టు ఎక్కడానికి ప్రయత్నించావు,బోర్లా పడ్డావు!ఒకవేళ నువ్వుచెట్టు ఎక్కగలిగినా నువ్వు వచ్చేవరకూ నేను ఎదురుచూస్తూ కూర్చోనుగదా?నాకు మాత్రం ప్రాణంపై ఆశ ఉండదూ? నేనెగిరిపోనూ!ఆమాత్రం ఆలోచించలేదా నీ మట్టిబుర్ర ఇక ప్రాణాలుపోతున్నా ఇచ్చినమాట నిలబెట్టుకోమన్నాను.కానీ ప్రాణదానం చేసి మాటతప్పి నన్ను మళ్ళీ చంపబోయావు అదే నీ నిలకడలేనితనం.నామాటల మహత్యం తెలియకదెబ్బతిన్నావు.
ఇకనైనా బుద్ధిగా మసలుకో అంటూ తుర్ర్...మంటూ ఎగిరిపోయింది. తిన్నడు వంటికి పట్టిన దుమ్ము వదిలించుకుంటూ ఉస్సూరుమనుకుంటూ ఇంటికిపోయాడు.
నీతి:వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగ పడక
వివరింపదగున్!కని,కల్ల నిజం తెలిసిన మనుజుడే ఓ నీతిపరుడు మహిలో సుమతీ!

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.