అంగీకారం

రాజకుమారి వంటింట్లో అంట్లు తోముతోంది...

ఆమె భర్త నటరాజు పడగ్గదిలో మంచమ్మీద కాళ్ళు చాపుకుని టీవీలో ఏం చూడాలో తేల్చుకోలేక చానల్స్ మార్చడానికి రిమోట్ బటన్స్ ని అదే పనిగా నొక్కుతూనే ఉన్నాడు. అతనికి టీవీ చూడడం అంటే ఏ క్రికెట్ మ్యాచో, తెలుగు సినిమా కామెడీ సీన్లో లేక ‘చికెన్ తినిందని భార్యను హత్య చేసిన భర్త’ లాంటి ‘రసవత్తరమైన’ వార్తో అయ్యుండాలన్నమాట.

అలసిన కళ్ళు మూతలు పడుతుండగా ఓ నిరంతర వార్తా వాహినిలో ప్రసారమౌతున్న దృశ్యం చూసి చల్లని నీళ్ళు మొహం మీద కొట్టినట్టైంది నటరాజుకి. వీపు నిటారుగా పెట్టి బాసిమఠం వేసుక్కూర్చుని మొహం ముందుకి పెట్టి కళ్ళు విప్పార్చి టీవీ చూస్తున్నాడు.

అమెరికాలో ఇద్దరు అందమైన ఎన్నారై కురాళ్ళు వివాహమాడుతున్న దృశ్యాలవి. నటరాజు చెవులు రిక్కించుకుని వింటున్నాడు. ఎవరా అబ్బాయిలు? ఎందుకు ఈ విపరీత పనులు చేస్తున్నారు యువత ఈ మధ్య? క్షణకాలంలో ఎన్నెన్నో సందేహాలూ అనుమానాలూ.

“రాజీ...” కేక పెట్టాడు.

వినబడదని అతనికి తెలుసు. గదిలో టీవీ మోగుతోంది, ఏసీ ఆన్ లో ఉంది, తలుపేసుంది. ఆమె రెండు గదులవతల వంటింట్లో ఉంది. ప్రతి సారీ గదిలో నాలుగు సార్లు అరిచి గానీ బయటకి వెళ్లి పిలవడు. ఈ సారీ అంతే.

నీళ్ళ శబ్దంలో కంచు మోగినట్టు వినిపించిన భర్త గొంతుకి విసుక్కుంటూ తడి చేతులు కొంగుకి అడ్డుకుంటూ వచ్చింది రాజీ.

“ఏంటండీ” మంచమ్మీద కూర్చుంటూ అడిగింది.

“అటు చూడవే”

ఆ వార్త పూర్తయ్యే లోపు నటరాజు కుళ్ళు జోకులు వెర్రి నవ్వులు రాజీ గంభీరమైన మౌనం నిండుకున్నాయి ఆ గదిలో.

“మొగోడు మొగోడ్ని పెళ్లి చేసుకోవడమేవిటే..ఏం చేస్కొడానికి?” వెక్కిలి నవ్వుతో అడిగాడు నటరాజు.

“అందులో అంత నవ్వాల్సిన పనేముంది? ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకునే అవకాశముంది కాబట్టి చేసుకున్నారు” టీవీ వైపు నుండీ మొహం తిప్పకుండా చెప్పింది రాజీ.

“మగవాడి మీద మగవాడికి ప్రేమేవిటే పిచ్చి మొహవా! పైగా అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు. అంత చదువుకుని ఇవేం పనులు? అసలా పెద్ద వాళ్ళననాలి! దగ్గరుండి మరీ సాంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిపిస్తున్నారు చూడు. వరూవరుళ్ళు మధ్యలో ముసి ముసి నవ్వులూ, బుగ్గలు గిల్లుకోడాలూ, ఏంటీ ఘోరం?” వ్యంగ్యంగా ఆశ్చర్యంగా అన్నాడు నటరాజ్.

“లేకపోతే మనలా ఎడ మొహం పెడ మొహం పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలంటారా? అదేదో తంతు నడుస్తూ ఉంటుంది, మన మొహాల్లో ఒక సంతోషం, ఉత్సాహం ఉండదు. ప్రేమనేది ఒకటేడిస్తే అలా నవ్వుకుంటూ ఆనందంగానే చేసుకుంటారు పెళ్ళిళ్ళు. ప్రేమకి మగేవిటి? ఆడేవిటి? రెండూ అయితే ఏవిటి? ఆ కుర్రాళ్ళిద్దరూ అదృష్టవంతులు. వాళ్ల తలిదండ్రులు అర్ధం చేసుకున్నారు, పెళ్లి చేశారు. మధ్యలో మీకేంటి దురద? మీ అమ్మా బాబు మా అమ్మా బాబుల్లా డబ్బు, రంగూ, ఎత్తూ, కులం చూసి చెయ్యాలా? ఆ అమెరికా అబ్బాయిలు కూడా కుల మతాలూ చూసే చేసుకున్నట్టున్నార్లేండి! కులం కలిస్తేనేగా కొన్ని మనసులు ఒకటైయ్యేది”

“చాల్లే ఎక్కువ్వాక్కు! వాళ్ళలో మొగుడెవడు? పెళ్ళామెవడన్నట్టు? కాళ్ళిరగ్గొట్టి ఆడపిల్లలతో పెళ్లి జరిపిస్తే వాళ్ళే దారికొస్తారు. అది మానేసి వాళ్లు తానా అంటే పెద్దాళ్ళు తందానా అనడమేంటో”

“ఇద్దరూ మొగుళ్ళే. అదేం పెద్ద సమస్యా! అయినా మీరే అన్నారుగా వరూవరుళ్ళని. ఇన్నాళ్ళు అలా ఆడపిల్లలకిచ్చి పెళ్లి చేసి, వాళ్లతో బతకలేక ఆత్మహత్యలు చేసుకోవడం, లేక ఆ అమ్మాయిలని వేధించడం లాంటి అన్యాయాలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇక చాలవంటారా? ఎవరు ఎవర్ని పెళ్ళి చేసుకున్నా ప్రేమతో బ్రతకితేనే ఆ జీవితానికి ఒక అర్ధం”

“మరి పిల్లలు? ఒంటరిగా ఎలా ఉంటారు? ఆఖరి రోజుల్లో ఏం చేస్తారు?”

“హహ్హహ్హా! మనలాగా పిల్లల్ని కనడం కోసమే ఓ ముక్కూ మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేస్కోలేదు వాళ్లు. ప్రేమించుకున్నారు, ఒకరికొకరు కట్టుబడి ఉండడానికి సమాజం ముందు ఒకటవ్వాలనుకున్నారు. శేష జీవితం కోసం పిల్లల్ని కనేంత స్వార్ధం తెలీదు పాపం వాళ్లకి. అంతగా కావాలంటే ఆడా మగా సక్రమంగా కని వదిలేసిన పిల్లల్ని పెంచుకుంటారులెండి! అసలు వాళ్లు పెళ్ళెందుకు చేసుకున్నారనేది మీ పెద్ద సందేహం. మీరెందుకు పెళ్లి చేసుకున్నారో చెప్తారా కాస్త”

నటరాజు ఆలోచనల్లో పడ్డాడు. భార్య కాస్త కొత్తగా కనబడుతోంది. ఎప్పుడూ ఏవో పనికిరాని విషయాలు మాట్లాడుకోడం తప్ప ఇలాంటి సంఘటనెప్పుడూ అతనికి ఎదురవలేదు.

“ఆలోచించకండి. అసహ్యమేస్తుంది” మొగుడి మొహంలోకి సూటిగా చూస్తూ అంది రాజీ.

“ఒక మగవాడు ఇంకో మగవాడికి ముద్దు పెట్టడంకంటేనా?”

“మీరు ఆడదాన్నేగా చేసుకున్నారు! పెళ్లై పిల్ల పుట్టి ఇన్నేళ్ళవుతున్నా నాకో ముద్దిచ్చారా? ముద్దు పేరు పెట్టి పిల్చారా? యజమాని నౌకరు పిలుపులు తప్ప మన మధ్య ఏమున్నాయి గనక?” నిష్ఠూరంగా అనింది రాజి.

“ఇదేంటే ఏదేదో మాట్లాడి ఆఖరికి నా మీద పడి ఏడుస్తావే? యజమాని నౌకరు ఎవరు మధ్యలో?”

“ఇంకెవరు? మీరూ...నేను! నేనూ సుబ్బులు మిమ్మల్ని ‘మీరూ’ అనేగా పిలుస్తాం. మీరూ మమ్మల్నిద్దరినీ ‘నువ్వూ’ అనేగా అంటారు. నా కన్నా ఆమే నయం. ఇదిగో అదుగో ఓయ్ ఒసేయ్ లాంటివి అనిపించుకోకుండా పేరు పెట్టి పిలిపించుకుంటుంది మీ చేత.

హ్! ప్రేమ లేకుండా పెళ్లి జరిగిపోతుంది...మాట లేకుండా మొదటి రాత్రి ముగుస్తుంది...కుశల ప్రశ్నలు లేకుండా కాన్పులూ జరుగుతాయి...పులకింతలు లేని గతంలోకి తొంగి చూస్తే ఒక అపరిచితుడ్ని పెళ్లి చేసుకోడం, నా అస్తిత్వం వాడి చేతుల్లో పెట్టడం, పిల్లల్ని కనే సామర్ధ్యం ఉంది కాబట్టి కనడం, వంట వార్పూ, ఇల్లు దులుపుకోడం, కారం ఆడించుకోడం తప్ప మధురానుభూతులేమున్నాయి!”

నటరాజు అహం దెబ్బతింది. అతనికి రోషం పొడుచుకొస్తోంది. ఆమె అసంతృప్తుల్ని ఒప్పుకోలేకపోవడమే కాదు, వినలేకపోతున్నాడు కూడా.

“ఏంటే! నీకంత ప్రేమించే హృదయముంటే ఎవడి వెంటన్నా పడి వాడ్నే చేస్కోవాల్సింది. పెద్దోళ్ళకి తలొంచి నన్నెందుక్కట్టుకున్నావ్? ముద్దు కావాలంట ముద్దు ఈ వయసులో”

“అదే చేతనైతే మిమ్మల్నెందుకు చేసుకునే దాన్ని! పెళ్లిలో ప్రేమ ఉంటుందనుకుని నాలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఎగబడి చేసుకుంటున్నారు గానీ జీవితం ఇంత జీవం లేకుండా చస్తుందంటే ఎవరు సాహసిస్తారు? నా బాధ ప్రేమ, ఆప్యాయత, మర్యాద, స్నేహంగా ఉండడం గురించి. కేవలం మదం పట్టిన ముద్దు గురించి కాదు. ఆ అబ్బాయిలని చూడండి. గుండెల్నిండా ప్రేమ. రెండు చేతులా సంపాదన. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడమే వాళ్ల పని. ఎంత అదృష్టం!”

“అంటే? నేను సంపాదించట్లేదా? నీకేం లోటు చేశాను? ఎంత అన్యాయంగా మాట్లడతావే. ఛీ! మొన్నేగా ప్రమోషన్ కూడా వచ్చింది”

“సంపాదిస్తారు. ప్రమోషన్లు వస్తాయి, అరియర్లు వస్తాయి. వాటి వల్ల మీ అమ్మానాన్నలకి, అక్కా చెల్లెళ్లకి మంచి జరుగుతుంది కానీ నాకూ నా కూతురికి ఏం చేశారనీ? పెళ్ళిళ్ళకీ ఫంక్షన్లకీ వెళ్ళాలంటే సిగ్గుపోతుంది. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లనుంచుకుని మీ అక్క కొడుక్కి గొలుసు చేయిస్తారు, చెల్లెలి కూతురికి కమ్మలు కొనిస్తారు. అదీ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా”

“అవునే! ఓ కొడుగ్గా మేనమామగా నాకు బాధ్యతలున్నాయి. నేను కాకపొతే ఎవడు చేస్తాడు?”

“మొగుడిగా, తండ్రిగా మీకేం బాధ్యతలూ లేవు. అంతేగా? పొదుపు మాకు. ఖర్చు వాళ్లకి! మీ కుటుంబం మీద మీకున్న ప్రేమ అదoతా. నన్నూ ప్రేమించుంటే నాకూ ఏదోక రోజు గ్రాము బంగారమన్నా కొనిచ్చేవారు. నోరు తెరిచి ఏదైనా అడిగితే ‘ఏంటి సందర్భం?’ అని తప్పించుకుంటారు. ఈ ఇరవైఏడేళ్ళలో ఒక్క సందర్భం కూడా దొరకలేదు కదా! అదే మీ వాళ్లకి కొనాలంటే రోజుకో సందర్భం పుట్టుకొస్తుంది నీకు. వివరాలు దాచడంలో, నన్ను కంట్రోల్ చెయ్యడంలో, పనులు చెప్పడంలో మాత్రమే నన్ను భార్యగా చూశావు గానీ మరే విషయంలోనైనా కనీసం మనిషిగా చూశావా! అదే నన్నూ ప్రేమించుంటే అప్పుడప్పుడు చిరు గొడవలు పడ్డా మన జీవితం సుఖంగా ఉండేది. రెండ్రోజులు నేను మాట్లాడకపోతే నీ నిద్ర నీది. నీ తిండి నీది. నేనెలా పోయినా నీకు సంబంధం లేదు. ప్రతి చిన్న విషయంలో నన్ను అవమానించడం తప్ప నాతో ఏకీభవించడం చేతనవ్వదు నీకు. నీ కూతురికి కూడా నీలా ప్రేమించలేని వాడ్నే తీసుకురా! నాలాగే ఏడుస్తూ చస్తుంది బతికినంత కాలం”

రాజకుమారి అప్పుడప్పుడు ఇలాగే నటరాజు దుమ్ము దులుపుతుంటుంది కానీ ఈ సారి ఎప్పుడూ చెప్పని విషయాలు ఒక్కసారిగా బయట పెట్టేసింది. కొంగుతో ముక్కు చీదుకుంటూ అక్కడ నుంచీ హాల్లోకెళ్ళిపోయింది.

నటరాజు నోట్లో మాట లేకుండా నిలబడిపోయాడు. మాట్లాడింది నా భార్యేనా? ‘నా’ అనడానికే సంకోచం. సిగ్గేస్తుంది.

“నిజంగానే నేనెప్పుడూ రాజీని ‘ఇంటి’ మనిషిగా చూశాను తప్ప సొంత మనిషిగా చూళ్ళేదు. పైకి ఒప్పుకోకపోయినా, అంతరాత్మ ముందు తలొంచాల్సిందే. తను చెప్పినట్టు ముందు నుంచీ ప్రేమించి ఉంటే నా జీవితం కూడా ఇంకా బావుండేది. ఒళ్లో పడుకుంటే కబుర్లు చెబుతూ నా తల్లో చేతి వేళ్ళు పోనిచ్చి చిలిపి అల్లరి చేసేదేమో. కానీ నేనెప్పుడూ తన వళ్ళో పడుకోలేదే! రోడ్డు మీద నడిచేటప్పుడు చేతిలో చేయి వేస్తే పులకించిపోయేదేమో! కానీ చేయి తగిలితే చిరాకు పడేవాడ్ని. నిజమే ముద్దూ మురిపాలు లేకుండానే యంత్రాల్లా పిల్లని కని బతికేస్తున్నాం. తనకు ప్రేమా ఇవ్వలేదు డబ్బూ ఇవ్వలేదు. నా తదనంతరం నాకున్నదంతా నా బిడ్డకే ఇస్తాను. మరి రాజీకి? అసలా ఆలోచనలే రాలేదు నాకు ఇంత వరకు. నా కోసం ఎంత చేసింది! నాకు జ్వరమొచ్చినా తనకు జ్వరమొచ్చినా తనే పనులు చేసేది. ఇదెక్కడి న్యాయం? ఇన్ని సంవత్సరాల తరువాత ఎవరో పెళ్లి గురించి తగాదా పడితే తప్ప నాకు తెలిసిరాలేదా? మొహమాటపడుతూ ఏడాదికో సారి పండక్కి చీర కొనుక్కుంటానని డబ్బులడిగితే కసురుకునేవాడ్ని. నేనే ఒక చీరెందుకు కొనివ్వలేకపోయాను? కారణం తెలియనట్టు నటిస్తావేరా నీచుడా! అడిగిందల్లా కొనిస్తే భార్య చెప్పు చేతల్లో ఉండదని. భార్యకు ప్రతి చిన్న సందర్భానికి ఏదో ఒకటి కొనివ్వడం అలవాటు చేస్తే దాని కొంగు పట్టుకు తిరుగుతున్నావని అందరూ అంటారు కాబట్టి. మరి నీ భార్య అడగకుండానే నీ కన్నీ చేసి పెడుతుంది కదరా నటరాజూ! ఎందుకు? నిన్ను భర్తగా ఒప్పుకుని, నిన్నే సర్వస్వం అనుకుని ప్రేమిస్తుంది కనుక. ప్రేమించని వాడ్ని కూడా ప్రేమించేంత గొప్పు మనసు గలది రాజీ. అందుకే ఆ కుర్రాళ్ళ ప్రేమని అర్ధం చేసుకుంది. ముందు రాజీకి ఏదైనా చెయ్యాలి” అనుకుంటూ అప్రయత్నంగా నటరాజు కళ్ళలోంచి కన్నీటి బిందువు రాలింది.

నటరాజు మనసులో సాలిగూడులా ఆలోచనలు ఒకదాని లోంచి మరొకటి అల్లుకుంటున్నాయి. గతం, భవిష్యత్తు అతనికి ఏవేవో చెప్తున్నాయి...

ఇంతలో పక్షులు కిచ కిచా అరుస్తున్న కాలింగ్ బెల్ మోగింది. కూతురు అమృత ఆఫిస్ నుండి వచ్చుంటుంది అనుకున్నాడు.

“హాయ్ మమ్మీ! వేడి నీళ్ళు కాయవా. చాలా అలసిపోయాను.” తలుపు తీసిన రాజీతో చెప్పులిప్పుతూ అంది అమృత.

రాజీ మాట్లాడే మూడ్ లో లేదు. నిశ్సబ్దంగా వెళ్లి పొయ్యి మీద నీళ్ళు పెట్టింది.

‘బాత్రూంలో వాటర్ హీటర్ పెట్టించమని ఎన్ని సార్లు చెప్పినా ఈ మనిషికి చెవికెక్కదు. ఆవేశంలో ‘నువ్వు’ అని కూడా అన్నాను. అక్షింతలూ బానే పడ్డాయి. నా మాటలకి బాధ కలిగిందో ఏమో’ మనసులో అనుకుంటూ కూతుర్నే చూస్తోంది తదేకంగా.

‘దీని వయసుకి నాకు పెళ్లై బిడ్డ కూడా పుట్టేసింది. ఎంత కష్ట పడుతుందో పాపం’ అనుకుంటూ కూతురికి పళ్ళ రసం ఇచ్చింది రాజీ.

“అమ్మా! నీకో విషయం చెప్పాలి. నాన్నతో కూడా అనుకో. ముందు నీకు చెప్తా. నువ్వు నాన్నకి చెప్పాలి. ఓకే నా?” పళ్ళ రసం అందుకుంటూ చెప్పింది అమృత.

“ఏం చెప్తావో వెళ్లి మీయబ్బతోటే చెప్పుకో పో” విసుగ్గా అంది రాజీ.

అమృతకి ఒళ్ళు మండిపోయింది. “చెప్తా నాకేమన్నా భయమా! నా దగ్గరేగా నీ ప్రతాపం. నాన్న ముందు ‘ఏవండి ఏంటండి’ అని ఊడిగం చేసిపెడతావ్” ఎగతాళి చేస్తూ పడగ్గదిలోకి వెళ్ళింది అమృత.

“నాన్నా” నటరాజు మొహంలోకి చూస్తూ మెల్లగా పిలిచింది.

ఆలోచనల్లోంచి నూతన నటరాజు బయటకు వచ్చాడు.

“ఏంటమ్మా! పని ఎక్కువైందా? కళ్ళు లోపలికి పోయి మొహం పీక్కు పోయింది”

“అవును నాన్నా. అదీ...మీతో ఒక విషయం చెప్పాలి...” నసిగింది అమృత.

“చెప్పమ్మా”

“నేనూ...ఒకర్ని ప్రేమించాను...మా ఆఫీస్ లోనే...”

నటరాజు పెద్దగా అరిచి గోల చేస్తాడనీ, ముందు కోపంతో ముఖం ఎర్ర బడుతుందని అనుకుంది అమృత. కానీ అదంతా జరక్కపోగా ప్రశాంతంగా ఉన్నాడు. అతనికి వెంటనే అమెరికా కుర్రాళ్ళ పెళ్ళీ, రాజీ మాటలు మళ్ళీ చెవుల్లో మారుమోగుతున్నాయి.

‘మాలా కాకుండా తన కూతురు ఆనందంగా పెళ్లి చేసుకోవాలి, ప్రేమతో జీవితాన్ని ఆస్వాదించాలి. అమృత ప్రేమించింది అబ్బాయినైనా అమ్మాయినైనా నా అంగీకారం పూర్తిగా ఉంటుంది’ మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు నటరాజు.

రాజీ వేడి నీళ్ళు బకెట్ లో తెచ్చి పడగ్గదిలో ఉన్న ఎటాచ్డ్ బాత్రూంలో పెట్టడానికొచ్చిoది.

“తప్పకుండా నీ ప్రేమని గౌరవిస్తానమ్మా! మీయమ్మ కూడా ఒప్పుకొవాలిగా. ఇంతకీ నువ్వు ప్రేమించింది అమ్మాయినా? అబ్బాయినా?”

ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గదిలోంచి బయటకు నడిచింది రాజకుమారి.

  • మానస ఎండ్లూరి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.