పరిపూర్ణ మహిళ


పి.యస్.యమ్. లక్ష్మి


టీ.వీలో పరిపూర్ణ మహిళ పోటీ గురించి ప్రకటన వస్తోంది. నా బుర్రలో ప్రకంపనలు. అలంకరణలోనూ, పాకశాస్త్రంలోనూ, లలితకళల్లోను ఇలా ఏవో వాళ్ళు పెట్టే పోటీల్లో గెలిచినవాళ్ళే పరిపూర్ణ మహిళలా, వాళ్ళని మించిన వాళ్ళెంతమందో. అసలు పోటీ చెయ్యని వాళ్ళుంటారు. అదీగాక ఈ చిన్న చిన్న గెలపరిపూర్ణత అనుకుంటే అసలు పరిపూర్ణతకే అర్ధంలేదనిపిస్తుంది.


వీళ్ళు పరిపూర్ణ మహిళలయితే జీవితంలో ఎన్నో కష్టాలను భరించి, తమవాళ్ళ సుఖంకోసం తమ సుఖాల్ని తమ జీవితాలనే త్యాగం చేసి కొవ్వొత్తిలా కరిగిపోయే వాళ్ళెందరో. ఏ చరిత్ర పుటలకీ ఎక్కని వాళ్ళందర్నీ ఏమనాలి?


ఎక్కడోదాకా ఎందుకు. మా పక్కింటి సూర్యం మావయ్య భార్య రేణుకక్కలేదూ! సూర్యం మావయ్యకు బాగా తాగుడలవాటు. మొదట్లో కొంచెం కొంచెంగా ఎవరికీ తెలియకుండా వుండే అలవాటు తరవాత్తరవాత పగలూ రాత్రీ అదే పని. అయిన వాళ్ళంతా అసహ్యించుకున్నా పట్టించుకునేవాడు కాదు. బంగారంలాంటి గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్నా 32 ఏళ్ళదాకా పెళ్ళి కాలేదు ఈ తాగుడు మూలంగా.


పాపం రేణుకక్కావాళ్ళు ఎలా తెలుసుకోలేక పోయారోగానీ వున్న ఒక్క ఇల్లూ అమ్మి వాళ్ళ అమ్మా నాన్నా రేణుకక్కకి ఈ పెళ్ళి చేశారు. అబ్బాయి ఖాయమైన ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి తప్పితే బాధ్యతలు లేవు, పిల్ల సుఖపడుతుందని.


కాపురానికొచ్చిన రోజునుంచీ రేణుకక్క కంటతడి పెట్టని రోజు లేదు. మొదట్లో సూర్యం మావయ్యని మార్చాలని శతవిధాలా ప్రయత్నించింది. ఈ పోరాటంలోనే రేణుకక్కకి కాస్తో కూస్తో తోడుగా వుండే సూర్యం మావయ్య తల్లి చనిపోయింది. రేణుకక్కకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అప్పటినుంచీ రేణుకక్క దిగులు పెరగింది. ఇద్దరు ఆడ పిల్లలు, భర్త చూస్తే తాగుడికి డబ్బులు కోసమే ఆఫీసుకెళ్తున్నాడుగానీ ఉద్యోగము బాధ్యతగా చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో కాదు.


పిల్లలకోసమయినా తాగుడు మానెయ్యమన్నది. ఆడపిల్లలు ... తండ్రి ఇలా తాగుబోతయితే సంఘంలో వాళ్ళకి గౌరవం వుండదు. పెళ్ళి కావటం కష్టమని మంచిగా చెప్పింది. వాళ్ళు పెద్దవుతున్నకొద్దీ మీ వైఖరి చూసి మిమ్మల్ని అసహ్యించుకోవచ్చు, అలాంటి పరిస్ధితి తెచ్చుకోవద్దు అని హెచ్చరించింది.


“పిచ్చిదానా, నా బంగారు తల్లులు నన్నేమీ అసహ్యించుకోరు. ఇంక పెళ్ళిళ్ళంటావా తాగుబోతునయిన నాకే అయినప్పుడు నా కూతుళ్ళకెందుక్కావు వాళ్ళేమన్నా తాగుతారా నా తల్లులకి మంచి సంబంధాలు చూసి పెళ్ళి చేస్తాను” అనేవాడు. పిల్లలకోసం ఏమీ చెయ్యకపోయినా, పిల్లలంటే చాలా ప్రేమ సూర్యంమావయ్యకి.


ఆ ప్రేమకూడా ఒక్కోసారి రేణుకక్కయ్యకి ఇబ్బందయ్యేది. పిల్లలేమన్నా అల్లరి చేసినా తప్పు చేసినా అక్క కోప్పడటం మావయ్య చూస్తే అక్కకి ఓ వారం రోజులు క్లాసు పీకేవాడు పిల్లల్ని పెంచటంరాదని.


పిల్లలు పెద్దవాళ్ళవుతున్నకొద్దీ అక్క ఇబ్బందులు పెరగసాగాయి. ఇతర పిల్లల తండ్రులతో తమ తండ్రిని పోల్చుకుని తల్లిని వేధించేవాళ్ళ.


“అమ్మా, నాన్నెందుకెప్పుడూ ఏంటోగా వుంటారు?” అని ఒకళ్ళడిగితే...


“అమ్మా, నాన్న చిన్నీ వాళ్ళ నాన్నలా ఎందుకుండరు? ఆ అంకుల్ చూడు ఎంత చక్కగా వుంటారో. ఎప్పుడూ మంచి బట్టలేసుకుంటారు. సూపర్ మేన్ లాగా చాలా స్ట్రాంగ్ కూడా. మన నాన్నకి సరిగా నుంచోవటమే రాదు. ఎప్పడూ వూగిపోతే వుంటారు” .. అని ఒకళ్ళు.


ఫిర్యాదుల స్ధాయినుంచి వాళ్ళూ వాళ్ళ ఆలోచనలూ ఇంకొంచెం ఎదిగారు.


“అమ్మా, మా ప్రెండ్స్ మన నాన్నని ఎగతాళి చేస్తున్నారే” .. అని ఒకళ్ళు బుంగమూతి పెడితే ...


“అమ్మా, నాన్నని డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళి మందిప్పిస్తే బాగవుతారమ్మా, తీసుకెళ్దాం.” ఎలాగైనా తమ తండ్రి బాగుండాలని ఒకళ్ళు ఆశించారు.


వాళ్ళ ఆలోచనలు సూర్యంకి చెప్తే కొంచెమయినా మార్పు వస్తుందేమోనని ఆశపడిందేగానీ అది కూడా పెడర్ధాలకి దారితీసింది.


“నువ్వేవాళ్ళకన్నీ నూరి పోస్తున్నావు. ఊహ తెలియని పిల్లలు .. వాళ్ళకిన్ని ఆలోచనలెక్కడివి, నువ్వు నేర్పించకపోతే” అనేవాడు.


పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులే కాకుండా సూర్యం మావయ్య తాగుడు ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి. తాగి తాగి ఆఫీసుకి సరిగ్గా వెళ్ళక జీతం కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఎదిగే పిల్లలకు కడుపునిండా తిండి కూడా పెట్టలేకపోతున్నానని రేణుకక్క బాధపడేది. రాను రాను పరిస్ధితి ఇంకా దిగజారటం మొదలయింది. రేణుకక్క చాలా అభిమానవతి. ఎన్ని అవస్ధలు పడుతున్నా ఇరుగుపొరుగు ఎవ్వరికీ ఏమీ తెలియనిచ్చేది కాదు.


“ఆ సూర్యం అలా తాగి తగలేస్తున్నాడు. పాపం ఆ పిల్ల ఎట్లా నెట్టుకొస్తోందో సంసారాన్ని” అనే వాళ్ళకి కూడా .. “ఏముంది పిన్నిగారూ, ఏదో స్నేహితులతో అలా ఎప్పుడన్నా సరదాపడతారుగానీ పెద్ద అలవాటేంకాదు ఆయనది. నేనన్నా పిల్లలన్నా పంచ ప్రాణాలు” .. అని సర్ది చెప్పేది. గుడ్డలో మూటకట్టి నిప్పుని దాయలేమని తెలిసినా, తన ప్రయత్నం తను చేసేది.


ఎప్పుడన్నా ఈ మాటలు సూర్యం మామయ్య చెవిలో పడితే పెద్ద రాధ్ధాంతమయిపోయేది. “నా గురించి ప్రచారాలు మొదలెట్టావా నువ్వు చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుందని,” అక్కని చితకబాదేవాడు. ఇరుగు పొరుగుకెక్కడ వినబడుతుందోనని గుడ్ల నీరు గుడ్ల కుక్కుకునేది అక్క.


కానీ అక్క అప్పుడు ఇచ్చిన సమాధానం నాకిప్పటికీ గుర్తే. “మీరేం ఏ రోగానికో మందేసుకుని కూర్చోలేదు, చూసేవాళ్ళకి తెలియకుండా వుండటానికి. మీ సంగతీ, మీ మందు సంగతీ ఎవరూ ప్రత్యేకించి చెప్పక్కర్లా మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది”. అక్క మావయ్యకి ఎదురు తిరగటం నేనప్పుడే చూశాను.


రాను రాను సూర్యం మావయ్య ఇంట్లో డబ్బులివ్వటంగానీ సరుకులు తేవటంగానీ మానేశాడు. ఒకసారి అక్క మాఇంటికి వచ్చి చీరకి పెట్టుకోవాలి గంజి కావాలని అడిగింది. అమ్మ అక్క చూడకుండా గంజిలో ఇంత అన్న కూడా వేసి కలిపి ఇచ్చింది. నాకు అర్ధం కాలేదు. అమ్మనడిగాను.


“గంజిలో అన్నంవేసిచ్చావు. అక్క చీరెలకెలా పెడుతుంది. మళ్ళీ వడకట్టుకోవాలి కదా” అని.


“పెద్దవాళ్ళ సంగతి నీకెందుకే, నీ చదువు సంగతి చూసుకో ఫో” … అని కసిరింది అమ్మ.


అయినా సంగతి తెలుసుకోకపోతే నాకు నిలకడ వుండదు. అక్క ఏం చేస్తోందో చూద్దామని వెళ్ళాను. అక్కడ దృశ్యం చూసి నాకేడుపొచ్చింది. అక్క ఆ గంజి అన్నాన్ని పిల్లలిద్దరికీ పెడుతొంది. వాళ్ళు తినమని మొరాయిస్తుంటే ఓపిగ్గా నచ్చచెప్తోంది.


“రేపు మీకిష్టమయినవన్నీ చేసి పెడతాను. ఇవాళ నాకు ఒంట్లో బాగుండక ఏమీ చెయ్యలేదు. అమ్మకోసం తినండమ్మా” అంటూ.


నాకేం చెయ్యాలో అర్ధం కాలేదు. వాళ్ళు చూడకుండా ఇంటికొచ్చేశాను. అమ్మకి అక్క సంసారం సంగతి కొంతన్నా తెలుసని అప్పుడు నాకర్ధమయింది. ఇంట్లో ఏం చేసినా వనజకిష్టమనో, జలజ నేను చేసింది బాగుంటుందంటుందనో, పిల్లల పేర్లు చెప్పి ఏదో ఒక వంకతో రేణుకక్కా వాళ్ళింటికి పంపేది నాచేత. ఆ ఇష్టాల వెనక నిజం నాకిప్పుడర్ధమయింది. ఎంత మంచిదానవమ్మా నువ్వు అనుకోకుండా వుండలేకపోయాను. నా ఆవేశాన్ని అమ్మ ముందు వెళ్ళగక్కకుండా వుండలేకపోయాను.


“ఏంటమ్మా, మావయ్య అన్ని బాధలు పెడుతుంటే రేణుకక్క అవన్నీ భరిస్తూ ఇక్కడే ఎందుకుండాలి వాళ్ళమ్మా వాళ్ళింటికెళ్ళిపోవచ్చుగా” .. ఆ మాత్రం ఆలోచన వాళ్ళకెందుకు రాలేదో నాకర్ధం కాలేదు.


“ఇబ్బందులున్నాయని సంసారాలు వదిలేసి ఎవరూ పుట్టిళ్ళకెళ్ళిపోరే. అయినా వాళ్ళమ్మా వాళ్ళయినా వున్నదంతా తెగనమ్మి పెళ్ళిచేశారు. ఇంకా ఈ వయసులో ఈ సంసారం బాధ్యతేమ్మోస్తారు. అదీగాక ఇద్దరూ ఆడపిల్లలయ్యే. వాళ్ళ సంగతి కూడా ఆలోచించాలిగా” ఏ మూడ్ లో వుందో అమ్మ నాకు సమాధానం చెప్పింది.


“ఆడపిల్లలయితే ఏమవుతుంది? వాళ్ళకి అండా దండా, పెళ్ళీ పేరంటం అంటారు. మీ పెద్దవాళ్ళంతా ఇంతే. ఆ వంకా ఈ వంకా చెప్పి కష్టాలు పడేవాళ్ళమీద సానుభూతి చూపిస్తారేగానీ ధైర్యంగా ఎదురు తిరగటం నేర్పించరు” ఆవేశంతో వూగిపోయాను.


“ఎదురు తిరిగితే ఏమవుతుందే. సంసారం ముక్కలవుతుంది. అండలేని ఆడవాళ్ళంటే లోకానికి చులకనవుతుంది”... అమ్మ ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలోనే ఆపేశాను.


“ఇవన్నీ మీ కాలంనాటి మాటలు. ఇప్పుడు ఆడవాళ్ళు మారుతున్నారు. మారాలి కూడా. ఏం మనలాంటి వాళ్ళం రేణుకక్కలాంటి వాళ్ళకి ఒక మార్గం చూపించలేమా మగవాళ్ళు చెడు అలవాట్లకి బానిసలయితే ఆడవాళ్ళిట్లా ఏడుస్తూ కూర్చోకపోతే ఏదో ఒకటి చెయ్యొచ్చుగా” అప్పటికప్పుడు ఏదో చేసేసి రేణుకక్కా వాళ్ళని ఉధ్ధరించేసి రేణుకక్క కష్టాలన్నీ ఉఫ్ అని ఊది పారేయాలనుకున్న నా ఆవేశాన్ని అమ్మ తేలిగ్గా కొట్టి పారేసింది.


“ఇంట్లో నాకు చిన్నమెత్తు సహాయం చెయ్యవుగానీ ఊరునుధ్ధరిస్తావా నీకూ పెళ్ళయ్యి నీ సంసారమంటూ ఏర్పడితే అప్పుడుండవు ఈ ఆవేశాలు” అంటూ.


అమ్మ మాటలు పట్టించుకోలేదు నేను. ఆడవాళ్ళు మారాలి. వాళ్ళూ మనుషుల్లా బతకాలి. అలా బతకనివ్వని వాళ్ళని ఎందుకు ఎదిరించకూడదు ఇద నా ఆలోచన. రేణుకక్కలాంటి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు మారరు. నాలాంటి వాళ్ళే మార్చాలి. నడుం బిగించి ఆలోచనలో పడ్డాను.


పక్క వీధిలో మహిళా సంఘంవాళ్ళు కుట్టు మిషను నేర్పుతున్నారని తెలిసింది. అంతే నాకొక పరిష్కారం కనబడింది. రేణుకక్క ఎక్కువగా చదువుకోలేదు. అదీగాక వయసు పరిమితులూ వగైరాలతో ఉద్యోగాలేమీ రావు. కానీ తనుకూడా సంపాదించుకోగలిగితే కనీసం పిల్లల్ని బాగా చూసుకోవచ్చుగా.


మామయ్య లేనప్పుడు సెంటరు చూసొద్దాం, తోడు రమ్మని అక్కని లాక్కెళ్ళాను. డిగ్రీ పూర్తయి ఖాళీగా వున్నానిప్పుడు నేను. ఏమీ తోచటం లేదు. కుట్టు నేర్చుకుంటాను సరదాగా. అమ్మ నన్నొక్కదాన్నే పంపించనంది. నువ్వొస్తే పంపిస్తుంది. పిల్లలు స్కూల్ నించి వచ్చేసరికి వచ్చేయచ్చు...అని బలవంతంగా నాతోపాటు కుట్టు సెంటరులో చేర్చాను.


“వాళ్ళు చెప్పిన బట్టలవ్వీ కొనాలంటే ఇప్పుడు అనవసరం ఖర్చెందుకమ్మా. కావాలంటే నీకూరికే తోడొస్తానులే” అన్నది అక్క. “మొదట్లో కొత్తవాటితో ఎవరూ నేర్చుకోరులే. పాతవాటితో కుడదాం. పైగా మహిళా మండలిదిగా. ఫీజు కూడా లేదు. డబ్బులు ఖర్చు పెట్టేదయితే నేను మాత్రం ఎందుకు చేరతాను. నాకు పీ.జీ లో సీట్ వచ్చేదాకా”. ఓ నెల కాలక్షేపానికని మొదట ఓ వారం రోజులు బలవంతంగానే లాక్కెళ్ళాను.


ఒకసారి మేము సెంటర్ కి వెళ్ళినప్పుడు మావయ్య ఇంటికి వచ్చారట. అక్క ఎక్కడికెళ్ళిందోనని కొంచెం కంగారు పడ్డారుట. అమ్మ నచ్చచెప్పిందట...తనే నాకు తోడు పంపించానని. అప్పటికి కంగారు తగ్గి ఈ మాటెళ్ళేటప్పుడు తాళాలు మీ ఇంట్లో ఇచ్చి వెళ్ళమనండి అని బయటకెళ్ళిపోయార్ట. అమ్మో మావయ్య ఇంట్లోనే రాక్షసుడు .. పరాయివాళ్ళ దగ్గర బయటపడడు.నా మాటల మీద అమ్మకి, రేణుకక్కకీ ఆ రోజు కొంచెం గురి ఏర్పడ్డది. అక్క ఇంట్లో లేకపోతే కంగారు పడ్డారంటే తన్నొదిలేసి వెళ్ళిపోయిందేమోనని భయపడ్డారని వాదించాను నేను.


అక్కకి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. తను కూడా ఏదన్నా చెయ్యవచ్చనే నమ్మకం వచ్చింది. చెయ్యాలనే తపన వచ్చింది. అందుకే అతి శ్రధ్ధగా తక్కువ కాలంలోని అన్నీ కుట్టటం నేర్చుకుంది. తనకి ప్రాక్టీసు కావాలని నా డ్రస్ లు తన చేతే సెంటర్ లో కుట్టించాను. నాకు సరిగ్గా రావటం లేదనో, కాళ్లు నొప్పులనో ఏదో ఒక వంక పెడ్తూ. ఆ పని చెయ్యటం వల్ల నాకు సహాయపడుతున్నానని, దానివల్ల మా రుణం కొంచెమన్నా తీర్చుకుంటున్నట్లు అక్క భావించేదనుకుంటా. చదువుకునే దానివి ఈ పని నువ్వేం చేస్తావులే నేను చేస్తానని సంతోషంగా చేసేది.


ఏ మాటకామాటే చెప్పాలి. రేణుకక్క చాలా తెలివిగలది. వాళ్ళు చెప్పే దానికి తన ఊహ కూడా జోడించి పనిలో నేర్పరితనం ప్రదర్శించేది. తమ పనిని అందరూ ప్రశంసిస్తూంటే అక్కకి తనమీద తనకి నమ్మకం పెరిగింది.


అమ్మా నాన్నల సహాయంతో ఒక రోజు ఒక కుట్టు మిషను కొనుక్కొచ్చి అక్కా వాళ్ళింట్లో పెట్టించాను. అక్క అభిమానపడ్డది. నన్ను కేకలేసింది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఆ మిషను డబ్బులు అప్పుకింద భావించి నెలకింతని తీర్చమన్న తర్వాత కాస్త సమాధానపడ్డది.


అప్పుడు అసలు భయం మొదలయింది. మావయ్య ఏమంటారో! ఇప్పటిదాకా తను కుట్టు నేర్చుకున్నట్లు మావయ్యకి తెలియదు. మిషన్ కి డబ్బులెక్కడివంటే ఏం చెప్పాలి అని…


మావయ్యకి ఆడవాళ్ళంటే చులకన భావం వుంది. దానికి తోడు ఆడవాళ్ళు ఇంటి పరిధి దాటకూడదనే మూర్ఖత్వంకూడా. ఆ అణచివేతతోనే అక్క అన్ని అవస్ధలు పడుతున్నా తనేమన్నా చెయ్యాలి అనే ఆలోచనే రాలేదనుకుంటా. అక్క మిషను కొనుక్కుని బట్టల కుట్టి డబ్బు సంపాదిస్తానంటే మావయ్య వూరుకోరు. మొదటికే మోసం వస్తుంది. మా మిషను వాడకుండా వుంటే పాడవుతోందని, తనని నేర్చుకొమ్మని ఇచ్చామని చెప్దామనుకున్నాం.


దానికీ పెద్ద రాధ్ధాంతం చేశాడుట మామయ్య.. “ఎవళ్ళ వస్తువులు వాళ్ళు చూసుకోలేరా నువ్వేదన్నా పాడుచేస్తే ఎట్లా మిషనూరికే వుందని గుడ్డలు కొనమంటావ్. అన్ని వెధవ్వేషాలు .. వెంటనే ఇచ్చేయ్” అన్నారుట.


అక్క ఇక్కడ మాత్రం ధైర్యం చేసింది. తననేమీ అడగనని గట్టిగానే చెప్పింది. మావయ్య ఆ విషయంలో ఎన్ని తిట్టినా అలవాటు ప్రకారం నోరు మెదపలేదు.


మొదట్లో అక్కకి గిరాకీ రావటానికి నేను కొంత శ్రమపడ్డాను. మా ఫ్రెండ్స్ కి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకీ చెప్పి వాళ్ళ బట్టలన్నీ అక్కకిచ్చేట్లు చేశాను. పిల్లలకీ, మావయ్యకీ తెలియకుండా వాళ్ళు బయటకెళ్ళిన తర్వాత అక్క పని మొదలుపెట్టేది. వాళ్ళొచ్చే టైముకి తను చేసిన పని ఆనవాలు కూడా కనిపించకుండా చేసేది.


పోను పోనూ నా అవసరం లేకపోయింది. అక్క పనితనం, ఇస్తానన్న టైముకివ్వటం, అందరికన్నా డబ్బులు కొంచెం తక్కువ తీసకోవటంతో అక్కకి పని కుప్పలుగా రాసాగింది. ఆదాయం కూడా కొంత వస్తుండటంతతో ఇంట్లో పిల్లలు పస్తులుండాల్సిన అవసరం లేకపోయింది.


అక్క సంపాదన సంగతి ఇంక ఇంట్లో దాచటం కూడా కష్టమయింది. మావయ్య వుండగానే అక్కకి బట్టలివ్వటానికో, తీసుకెళ్ళటానికో ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి మావయ్య పక్కకి వెళ్ళిపోయేవారు.


దాంతో అక్కకి ఇంకా ధైర్యమొచ్చేసి విశ్రాంతి లేకుండా పని చెయ్యటం మొదలెట్టింది. అది చూసి మావయ్య ఇంట్లో డబ్బులివ్వటంగానీ, సరుకులు తీసుకురావటంగానీ పూర్తిగా మానేశారు. పైగా అప్పుడప్పుడూ అక్కనడిగి డబ్బులు తీసుకునేవారు.


ఒకసారది నా కళ్ళపడ్డది. మావయ్య వెళ్ళిపోయాక అక్క బుర్ర తినేశాను.


“ఆయన అంత జీతం తెచ్చుకుంటూ ఇంట్లో పది రూపాయలివ్వటం లేదు. నువ్వు పదీ పరకా సంపాదించి, ఇల్లు నడుపుతూ, మళ్ళీ ఎదురు డబ్బులు కూడా ఇస్తున్నావెందుకు?” అని నిలదీశాను.


“దాని మూలంగా ఇల్లు కాస్త ప్రశాంతంగా వుంటోంది. ఇంట్లో గోల లేకపోవడంతో పిల్లలు కాస్త సంతోషంగా వుంటున్నారోయ్”. అక్క ముఖంలో తొంగి చూసిన సంతోషం చూసి పోనీలే అని నేనూ కాస్త ఆవేశం తగ్గించుకున్నాను. మగవాళ్ళు సంపాదిస్తే ఆడవాళ్ళు కూర్చుని తింటున్నప్పుడు ఆడవాళ్ళు సంపాదిస్తే మగవాళ్ళు కూర్చుని తింటే తప్పేమిటి అనుకున్నాను. మరి వాళ్ళూ వీళ్ళూ సమానమనిగదా నా వాదన.


కానీ అక్కకి ఆ మనశ్శాంతి ఎక్కువ కాలం నిలువలేదు. మావయ్య డబ్బలడగటం ఎక్కువయ్యింది. ఇవ్వకపోతే అక్కకి తిట్లు, దెబ్బలు, మళ్ళీ ఇల్లు నరకం కాసాగింది.


అయితే ఈమాటు మా ఎవరి సహాయం లేకుండానే అక్క ధైర్యంగా నిలబడ్డది. మొండిగా మావయ్యని ఎదిరించింది.


“మీరు జీతం తెచ్చి ఎటూ ఇంట్లో ఇవ్వటంలేదు. పిల్లలు పస్తుంటున్నారు. ఏదో భగవంతుడు నాకో దారి చూపించాడు. ఇప్పటికైనా మీరు మారితే మనిద్దరి సంపాదనతో పిల్లల్ని చాలా బాగా చూసుకోవచ్చు. ఎటూ ఇంట్లో మీరేం డబ్బులివ్వటంలేదు. పెట్టిందేదో తిని గోల చెయ్యకుండా వుండండి. ఇల్లు ప్రశాంతంగా వుంటేనే పిల్లలు చదువుకోగలుగుతారు.” పిల్లల భవిష్యత్ గురించి అందమైన కలలెన్నో వున్నాయి అక్కకి.


అయినా మావయ్య లొంగలేదు. పైగా అక్క దాచిపెట్టుకున్న డబ్బులు అక్కకి తెలియకుండా తీసుకోవటం మొదలుపెట్టారు. ముందే చెప్పానుకదా. అక్క తెలివయిందని. డబ్బులు మావయ్య కళ్ళబడనివ్వలేదు. ఆ కోపమంతా అక్కని కొట్టటం ద్వారా తీర్చుకునేవారు. అక్క కూడా మొండికేసింది. దాంతో మావయ్య మందు డోసులు తగ్గలేదుగానీ నాణ్యతలో తేడాలొచ్చాయి. ఖరీదయిన మందునుంచి నాటుసారాకి దిగిపోయాడు. అది తాగి రోడ్డుమీదే పడిపోతే తెలిసినవాళ్ళు చూస్తే ఇంటికి చేర్చటం.


పిల్లలకి ఊహ తెలుస్తుండటంతో వాళ్ళకిది అవమానంగా తోచేది. వాళ్ళూ ఈ సమాజంలో మనుషులే కదా. కానీ అక్క పిల్లల పెంపకం విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో చాలా శ్రధ్ధ తీసుకుంది. తండ్రిని అగౌరవ పరచనిచ్చేది కాదు. ఆ పెంపకంవల్లే తండ్రి మూలంగా వాళ్ళెంత అవమానాలు పడ్డా తండ్రిని వాళ్ళెప్పుడూ ప్రేమగా చూసేవాళ్ళు. ఆయనకెంతో సేవచేసే వాళ్ళు. ఆయన వాళ్ళని కూడా డబ్బులడిగితే ఏడ్తేవాళ్ళు.


అలాంటి పరిస్ధితుల్లో పిల్లలు చదువు నిర్లక్ష్యం చేస్తారని అక్క వాళ్ళు చదువుకున్నంత సేపూ తనూ మేలుకుని వాళ్ళతోనే కూర్చునేది. తను ఎక్కువ చదువుకోకపోయినా పిల్లలు యల్.కే.జీ నుంచి ఇంజనీరింగ్ దాకా వాళ్ళ చదువు గురించి ప్రతి రోజూ అక్క తీసుకున్న శ్రధ్ధ బహుశా అన్ని విధాలా హాయిగా వున్నవాళ్ళెవరూ తమ పిల్లల గురించి తీసుకోరేమో...


పిల్లల గురించే కాదు. అక్క తన బిజినెస్ గురించి కూడా చాలా శ్రధ్ధ వహించింది. బిజినెస్ అని ఎందుకంటున్నానంటే కుట్టు మిషన్ డబ్బు మాకు తిరిగిచ్చెయ్యటమేగాక నెమ్మది నెమ్మదిగా ఇంకో ఇద్దరు బీద వాళ్ళకి పని నేర్పించి కుట్టినందుకు వాళ్ళకింతని డబ్బు ఇచ్చేది. కాలగమనంలో వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది.


వర్కర్స్ పెరగటంతో మిషన్లు పెరిగాయి. తనే బట్టకొని, కుట్టించి రెడీమేడ్ డ్రెస్ లు షాపులకి సప్లయి చేయటం మొదలెట్టింది. ఇప్పుడదొక చిన్న సంస్ధ అయింది. అక్కకి సంఘంలో గుర్తింపు పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆవేశంతో కొని పెట్టిన ఒక్క మిషను దాన్ని నడిపించిన వ్యక్తి గుండె ఆవేదన, ఆక్రోశం, అవమానాలతో రగిల్చి మండించిన పట్టుదలనుంచి వేళ్ళూని మొక్కయి ఎదికి మానై ఇంకా కొందరికి నీడనిచ్చి ఆకలి తీరుస్తోంది.


ఆ నీడలో అయ్యో ఇద్దరూ ఆడపిల్లలే అని భయపెట్టిన సంఘానికి సమాధానం చెప్పినట్లు పిల్లలిద్దరూ ఇంజనీర్లయి మంచి ఉద్యోగాల్లో చేరారు. మావయ్య గౌరవం గంగలో కలిసినా అక్క సత్ప్రవర్తన, పట్టుదలతో సంఘంలో వచ్చిన స్ధాయి, తెచ్చిన గౌరవంతో ఆడపిల్లలిద్దరికీ మంచి వరుళ్ళు దొరికారు.


పిల్లల బాధ్యత తీరిందని అక్క ఇప్పుడు సంతోషంగా వున్నా మావయ్య ప్రవర్తన మానని పుండులాగా బాధవెడుతూనే వున్నది. కూతుళ్ళే కాదు. అల్లుళ్ళూ బంగారాలే. ఇప్పటిదాకా కష్టపడ్డారు. ఇంకా ఎందుకండీ హాయిగా విశ్రాంతి తీసుకోండి అని అల్లుళ్ళంటే అక్క చెప్పిన మాట...


“ఒక కుటుంబం అందించిన సాయంతో నా కుటుంబం ఇప్పడీ స్ధాయికొచ్చింది. వాళ్ళ చేయూత లేకపోతే మా పరిస్ధితి ఏమిటి అని తలచుకోవటానికే భయపడతాను. నాలాంటి వాళ్ళు దేశంలో ఎందరో... అన్నీ అనుభవించిన నేను నాపనయిపోయిందని చేతులు ముడుచుక్కూర్చుంటే ఎలా? నాలాంటి వాళ్ళకి కొందరికయినా నేను చేయూతనిస్తే ఇంకా కొన్ని కుటుంబాలు బాగుపడతాయికదా! నా పనేదో నన్ను చేసుకోనివ్వేడి.”


తన పని తన అవసరం, తన బాధ్యత పూర్తి కాలేదని నాలుగు ముక్కల్లో తేల్చి చెప్పిన అక్కలాంటి పరిపూర్ణ మహిళలు ఏ మీడియాలకూ అందనివాళ్ళు ప్రపంచంలో ఎందరో!!!


అలాంటి వాళ్ళందరికీ శతకోటి వందనాలు! వాళ్ళే లేకపోతే ఆ కుటుంబాల గమనం ఎటువైపో!!??


(రంజని దసరా-దీపావళి సంచికలో ప్రచురించబడింది.)


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.