దటీజ్ ఫ్యాషన్...!

"చందమామ నడిగా, తళుకుమనే తారల నడిగా...పిల్లగాలి నడిగా, అది మోసుకొచ్చే సౌరభాల నడిగా...ఆ చెట్టు నడిగా, దాని పైనున్న పిట్ట నడిగా...’ఐడియా’ సెల్ ని కూడ అడిగా - మా అక్కయ్య బుర్రలో ఓ మ్యాడ్ మ్యాడ్ మాడ్ ఐడియాని దూర్చమని! దాన్ని తాను ఫ్యాషన్ గా మలచుకుంటుందనీ!..." - ఆశువుగా పాడుకుంటూన్న చెల్లెలి వంక చురుగ్గా చూసింది మధురిమ.

నీరజ ఫక్కున నవ్వేసింది. "బుర్ర బ్రద్దలుగొట్టుకుంటున్నా నీకు ఐడియాలేవీ తట్టడంలేదనీ...ప్రకృతికి ఈ విన్నపాలు!" అంది కొంటెగా.

ఆ పిల్ల చిలిపిదనానికి ఉడుక్కుంటూ దగ్గరకు వెళ్ళి నెత్తిమీద చిన్నగా మొట్టికాయ వేసింది మధురిమ. "మమ్మీ డిన్నర్ కి పిలుస్తోంది," అని చెప్పేసి కిలకిల నవ్వుతూ అక్కణ్ణుంచి తుర్రుమంది నీరజ. పదహారేళ్ళుంటాయి ఆమెకు. అక్కకంటె ఐదారేళ్ళు చిన్నది.

మధురిమలో అందం కంటె సృజనాశక్తి, ఆసక్తి అధికం. చిన్నప్పట్నుంచీ ఫ్యాషన్స్ అంటె చెవి కోసుకునేది. కథల పుస్తకాలకు బదులు ఫ్యాషన్ మేగజీన్స్ ని తిరగేసేది. టీవీలో ఫ్యాషన్ ఛానెల్స్ ని తెగ చూసేది. అమ్మ చీరలు ఒంటికి చుట్టబెట్టుకుని ఇంట్లో ర్యాంప్ వాక్ చేసేది.

అత్యంత ఖర్చుతో కూడుకున్నదని ఇంటిల్లపాదీ వద్దంటున్నా, డిగ్రీ తరువాత పీజీ చేయకుండా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో చేరింది. డిప్లొమా చేసి, ఓ పేరున్న ఫ్యాషన్ డిజైనర్ దగ్గర అప్రెంటిస్ గా చేరింది.

ఆధునిక యువతి ఉడుపుల డిజైన్స్ లో విప్లవాన్ని ప్రవేశపెట్టాలన్నది మధురిమ అభిలాష. తానూ ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కావాలన్న ఆకాంక్ష. తాను డిజైన్ చేసిన దుస్తుల్ని ధరించి ప్రముఖ మోడల్స్ ర్యాంప్ మీద వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తున్నట్లు కలలు కంటూ వుంటుంది.

ఆ మధ్య ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఫ్యాషన్ డిజైనింగ్ లో అంతర్జాతీయ పోటీని ప్రకటించింది. స్త్రీల దుస్తులలో సరికొత్త డిజైన్స్ ని రూపొందించినవారికి డాలర్స్ లో పెద్ద బహుమతులే ఇస్తోంది. ఆ పోటీలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరున మధురిమకు తన బాస్ నుంచి తగిన ప్రోత్సాహం లభించలేదు. దాంతో మరింత పట్టుదలతో స్వయంగా డిజైన్ తయారుచేసి పోటీకి పంపించాలని నిశ్చయించుకుంది.

ఐతే, నెల్లాళ్ళుగా బుర్ర ఎంత బ్రద్దలు చేసుకున్నా సంతృప్తికరమైన ఐడియా మధురిమను వెలివేస్తోంది. ’ఆల్సో ర్యాన్’ కేసులా కాక, తాను రూపొందించబోయే డిజైన్ ’సమ్ తింగ్ నావెల్ అండ్ ఆసమ్’ గా ఉండాలన్నది ఆమె తపన. వివిధ ప్రదేశాలను సందర్శించింది, తనకు కావలసిన ’వస్తువు’ ను ప్రకృతిలో వెదుక్కుంటూ. పోటీ గడువులో ఓ నెల అయిపోయింది. ఇంకో రెండు నెలలే మిగిలి ఉన్నాయి. ఆ వ్యవధి లోపున డిజైన్ చేసి, మెటీరియల్ స్టిచ్ చేసి డ్రెస్ నమూనాని పంపవలసియుంటుంది.

ఐడియాస్ కోసం మధురిమ పడే పాట్లు కుటుంబసభ్యులకు వినోదమయ్యాయి. ఆమెను ఆట పట్టించారంతా. "ఎందుకొచ్చిన పాట్లు ఇవి! డిజైనింగ్ ని పక్కను పెట్టి, డిజైనర్ డ్రెసెస్ షాపు పెట్టుకున్నా ...బోలెడు ఆదాయం" అంటూ విసుక్కున్నాడు తండ్రి రాజారావు.

"ఎప్పుడోకాని ధరించడానికి వీలుకాని పిచ్చి డ్రెస్ ల కోసం బుర్ర పాడుచేసుకోవడం ఎందుకే?" అంటూ సన్నగా చీవాట్లు వేసింది తల్లి శ్యామలమ్మ.

"అక్కా! రోజూ బిర్లా మందిర్ కి వెళ్ళి ఓ గంటసేపు అక్కడ కూర్చున్నావంటే...ఐడియాలే ఐడియాలు నీకు!" ముసిముసిగా నవ్వింది నీరజ.

"మధు అక్కా! ఓ మార్వలెస్ ఐడియా!" ఎక్సైటింగ్ గా అన్నాడు పన్నెండేళ్ళ తమ్ముడు. ఏడవ తరగతి చదువుతున్నాడు వాడు. ’ఏమిటన్నట్టు’ ఆసక్తిగా తమ్ముడి వంక చూసింది మధురిమ.

"మా స్కూల్ దగ్గరకు రోజూ ఓ పిచ్చిది వస్తూంటుంది. దాని బట్టలు రోజుకో తీరుగా ఉంటాయి. నాలుగు రోజులపాటు నువ్వు మా స్కూలుకు రారాదూ...దాన్ని స్టడీ చేసావంటే - అయామ్ ష్యూర్, యు విల్ గెట్ యాన్ ఆసమ్ ఐడియా," చెప్పాడు వాడు.

మధురిమకు పిచ్చికోపం వచ్చేసింది. వాణ్ణి తరిమి పట్టుకుని మరీ చెమడాలు ఎక్కదీసింది.

వాడు ఏడుస్తూ, "పోకిరి సినిమాలో మహేష్ బాబు దెబ్బకు అయినట్టు, నీ మైండ్ బ్లాంక్ అయిపోగాక!" అంటూ శపించేసాడు కోపంగా.

"చంపేస్తాను, వెధవా!" అంటూ ఉరిమింది మధురిమ.

నాన్నమ్మ కలుగజేసుకుని, "పిచ్చి తల్లి! దాన్ని ప్రోత్సహించవలసింది పోయి, దాని ఉత్సాహం మీద చన్నీళ్ళు క్రుమ్మరిస్తారేమర్రా మీరంతా!" అంటూ మందలించింది. సుమారు డబ్భై ఐదేళ్ళుంటాయి ఆవిడకు…

ఎట్టకేలకు ఓ డిజైన్ ని తయారుచేసి మోడెల్ డ్రెస్ స్టిచ్ చేసింది మధురిమ. దాన్ని తొడుక్కుని అద్దంలో చూసుకుంటూ గదిలోనే క్యాట్ వాక్ చేసింది. దాన్ని ఎవరికైనా తొడిగి చూడాలనుకుంది.

చెల్లెలికి అది పొడవయిపోతుంది. "మమ్మీకి తొడిగి చూద్దాం" అంది నీరజ.

అలాంటి పిచ్చి డ్రెస్ లు తొడుక్కోనంటూ శ్యామలమ్మ ప్రొటెస్ట్ చేస్తున్నా పట్టించుకోకుండా, అక్కచెల్లెళ్ళు కలసి బలవంతంగా తల్లికి ఆ డ్రెస్ తొడిగేసారు. నిలువుటద్దం ముందు ఆమె చేత క్యాట్ వాక్ చేయించారు. కాదు, కాదంటూనే పెద్ద కూతురు చెప్పినట్టు వివిధ భంగిమలలో పోజులు ఇస్తూ, అటు ఇటు వయ్యారంగా నడచింది శ్యామలమ్మ, లోలోపల మురిసిపోతూ.

అత్తగారు చప్పిడి దవళ్ళు నొక్కుకుంటూ అబ్బురంగా చూస్తూంటే సిగ్గు ముంచుకువచ్చింది ఆమెకు. "మీ డాడీ ఆఫీసునుంచి తిరిగొచ్చే వేళయింది. నన్ను ఈ డ్రెస్ లో చూస్తే అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. ఇక చాలించండి" అంది కూతుళ్ళతో.

నీరజ బుర్రలో ఫ్లాష్ వెలిగింది. "ఐడియా! ఈ డ్రెస్ లో డాడీ మమ్మీని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం, అక్కా!" అంది.

అంతే! తల్లి ప్రొటెస్ట్ ని లెక్కచేయకుండా, ఆమె డ్రెస్ తీయకుండా ఆపేసారు.

కాసేపటికి డోర్ బెల్ మ్రోగడంతో - వచ్చింది కొడుకే అయుంటాడని, ముసలావిడ చల్లగా తన గదిలోకి జారుకుంది. శ్యామలమ్మ వంటింట్లోకి పారిపోబోయింది. కూతుళ్ళు ఆమెను ఆపి, తలుపు తీయమని ముందుకు త్రోసారు.

తలుపు తెరచిన భార్యను చూసిన రాజారావు, "సారీ అండీ. మా ఇల్లు అనుకున్నాను" అంటూ వెనుదిరగబోయాడు. వెనుకనుండి కూతుళ్ళు నవ్వుతూ చప్పెట్లు చరిచారు.

"అయ్యో! ఇది మన ఇల్లేనండీ" అంటూన్న భార్య గొంతుకు గుర్తుపట్టి వెనుదిరిగిన రాజారావు, ఆమె వదనంలోకి తేరిపారజూసాడు.

"నువ్వేనా! ఏమిటీ ఈ బుడబుక్కల డ్రెస్?" అన్నాడు ఆశ్చర్యపోతూ.

ఆ పలుకులతో మధురిమ వదనం చిన్నబోయింది. పట్టించుకోవద్దన్నట్టు అక్కను ప్యాట్ చేసింది నీరజ.

"ఇదంతా మీ కూతుళ్ళు..." అంటూ ఏదో చెప్పబోతూ ముందుకు కదిలిన శ్యామలమ్మ బోర్లా పడిపోయింది.

ఆమె తల తన పాదాలను తాకడంతో, "సరి, సరి. ఈ మాత్రానికే నా కాళ్ళపైన పడనవసరంలేదులే" అంటూ భుజాలు పట్టుకుని లేవదీసాడు రాజారావు.

మూతి మూడు వంకర్లు త్రిప్పుకుంది శ్యామలమ్మ. "నా బొంద! మీ కాళ్ళ మీద పడాల్సినంత అపరాధం నేనేం చేయలేదు. ఈ డ్రెస్ కాళ్ళలో పడి బొక్క బోర్లా పడ్డానంతే" అంది.

తండ్రి పలుకులు బుర్రలో మెదులుతూంటే, ఆ డ్రెస్ పెద్ద అప్పీలింగ్ గా ఉన్నట్లనిపించలేదు మధురిమకు. మళ్ళీ కొత్త ఆలోచనల వేటకు ఉపక్రమించింది…

నీరజకు, బామ్మకూ క్షణం కూడా పడదు. ’ముసలీ!” అని పిలుస్తుంది నీరజ, బామ్మను. తల్లి మందలించబోతే, ’ముసలాళ్ళు పసిపిల్లలతో సమానమంటారు. అంటే తాను నాకంటె చిన్నదనేగా!’ అంటూ లాజిక్ తీస్తుంది. బామ్మకు ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది. దాంతో పిల్లలకు పండుగలకు పబ్బాలకు ఏదో ఒకటి కొనిపెడుతూంటుంది ఆవిడ. నీరజ తనకు డబ్బులు అవసరమైనపుడల్లా బామ్మను దబాయించి అడిగి తీసుకుంటుంది.

ఆవిడ ఎప్పుడైనా ఇవ్వకపోతే, ’తమ్ముడికైతే వాడు అడక్కుండానే ఇస్తావు. నాకు ఇవ్వడానికి ఏడుస్తావేమే ముసలీ?’ అంటూ ఆవిడ జుట్టు పట్టుకుంటుంది.

’వాడు చిన్న పిల్లాడే’ అంటే, ’కాదులే. నీకు మగపిల్లలంటే పక్షపాతం ఎక్కువ!’ అంటూ దెబ్బలాడుతుంది. డబ్బులు ఇచ్చేంతవరకు ఊరుకోదు.

బామ్మ కూడా మొండికేసిన రోజున, ఆవిడ పాత ట్రంకు పెట్టె మీద ’ఇన్ కమ్ టాక్స్’ రెయిడ్ లాంటిది చేస్తుంది నీరజ. బామ్మ చీర మడతల్లో దాచుకున్న డబ్బుల్లోంచి తనకు కావలసింది తీసుకుని, ’పెట్టె నువ్వే సర్దుకో’ అంటూ వదిలేసి వెళ్ళిపోతుంది.

అలాగని, వారికి ఒకరంటె ఒకరికి ఇష్టం లేదనుకుంటే, ఫూల్ అయినట్టే! చిన్న మనవరాలి గడుసుదనానికి మురిసిపోతూంటుంది బామ్మ. అలాగే, ఏనాడైనా ఒంట్లో నలతగా ఉందని బామ్మ మంచం దిగకపోతే, నీరజకు నెమ్మది ఉండదు. దగ్గర చేరి సపర్యలు చేస్తుంది, వద్దంటున్నా వినకుండా. ఆవిడ లేచి తిరిగేంతవరకు ఏదోలా ఉంటుంది ఆ పిల్లకు. ఆ బామ్మా-మనవరాళ్ళది ’గిల్లికజ్జాల’ అనురాగబంధం!

ఆ రోజు నీరజ బామ్మ ట్రంక్ పెట్టె మీద రెయిడ్ చేసింది. ఈసారి డబ్బుల కోసం కాదు. బట్టల కోసం… నీరజ కాలేజ్ లో స్టూడెంట్స్ అంతా అనాథ స్త్రీల కోసం పాత దుస్తుల్ని సమీకరిస్తున్నారు. శ్యామలమ్మ, మధురిమ తలో రెండు జతలూ ఇచ్చారు. బామ్మ మాత్రం ’తన కొడుకు కొన్న చీరలు’ ఎవరికీ ఇవ్వనంది.

"ప్రతి పండక్కీ డాడీ నీకు చీరలు కొంటూనే వున్నారు కదా. పాత చీరల్లో ఓ జత ఇస్తే నీదేం పోతుందే, ముసలీ?" అంటూ పోట్లాడింది నీరజ. అడ్డు వచ్చిన బామ్మను పక్కకు నెట్టేసి, ట్రంకు పెట్టెను చాప మీద బోర్లించింది.

"పండోరాస్ బాక్స్ కంటె పరమ చెత్తగా ఉంది నీ పెట్టె" అంటూ అన్నీ కెలికివేయనారంభించింది.

అంతలో మధురిమ ఇంటికి వచ్చింది. బామ్మ రుసరుసలు, చెల్లెలి విసుర్లూ ఆలకించేసరికి విషయం అర్థమయిపోయింది ఆమెకు.

నీరజ పెట్టె అడుగునుండి పాత డ్రెస్ ఒకటి తీసింది. "ఏమే ముసలీ! దీన్నింకా ఎన్ని యుగాలు దాస్తావే? దీన్ని నాకు ఇచ్చేయకూడదూ?" అంది, విప్పి ఒంటికి పెట్టుకుని చూస్తూ.

"నా పట్టుచీరలన్నీ నువ్వే పరికిణీలుగా కుట్టించేసుకున్నావు కదే, రాక్షసీ! అదొకటీ నీ కంట్లో పడలేదనుకుంటే, దాన్నీ చూసేసావూ?" అంది బామ్మ కంగారుగా.

"దీన్నిక మరచిపో" అంది నీరజ.

బామ్మ లబోదిబో మంది. "ఒసే, నీరూ! ఆ డ్రెస్ నా ప్రాణమే!" అంటూంటే, ఆవిడ మనసు అరవయ్యేళ్ళు వెనక్కి పోయింది...

పదిహేనేళ్ళైనా నిండాకుండానే పెళ్ళయిపోయింది ఆవిడకు. పెళ్ళికి చీరలు కొంటూంటే, ఆరిందాలా తాను చీరలు కట్టుకోనని ఏడ్చి డ్రెస్ లు కుట్టించుకుంది. వాటిలో తనకు అమితంగా నచ్చిన ’ఆ డ్రెస్’ తోనే పీటల మీద కూర్చుంది. తల మీద జీలకర్ర, బెల్లం పెట్టించుకుంది. మెళ్ళో తాళి కట్టించుకుంది. తలంబ్రాలు పోయించుకుంది...అందుకే అరవయ్యేళ్ళుగా దాన్ని అపురూపంగా దాచి వుంచుకుంది. స్వర్గస్థుడైన భర్త గుర్తుకు వచ్చి మనసు భారమయినపుడల్లా చాటుగా ఆ డ్రెస్ తీసి చూసుకుని ఉపశమనం పొందుతూ వుంటుంది... అదే విషయం మనవరాలికి చెప్పింది బామ్మ.

ఐతే ఆవిడ సెంటిమెంటును అర్థంచేసుకునే మూడ్ లో లేదు నీరజ. "చచ్చాక ఈ డ్రెస్ తొడుక్కుని వస్తానని తాతయ్యకు మాటిచ్చావా ఏమిటీ?" అంది వ్యంగ్యంగా.

ఆ పిల్ల పలుకులకు హర్ట్ ఐన బామ్మ కళ్ళలో నీళ్ళు ఊరాయి.

శ్యామలమ్మ ఎక్కడో పెరట్లో ఉంది. అక్కడే ఉన్న మధురిమ చెల్లెలి వద్దకు వెళ్ళి కోపంగా ఆ డ్రెస్ ని లాక్కుంది. "పెద్దంతరం, చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలూ?" అంటూ నీరజను తిట్టింది. బామ్మ సెంటిమెంటుకు ఆలవాలమైన ఆ డ్రెస్ ని పరీక్షగా చూసి, జాగ్రత్తగా మడత పెట్టి ఆవిడ చేతిలో పెట్టింది. "సారీ, బామ్మా! చెల్లికి కాలేజ్ కి వెళ్ళినా ఇంకా పసిదనం పోలేదు. బాధపడకు" అంటూ ఓదార్చింది.

నీరజ కోపంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. మధురిమ ఓపికగా బామ్మ బట్టలన్నీ మడతపెట్టి పెట్టెలో పెట్టి, సర్దింది…

మధురిమ మరో డిజైన్ ని సృజించి, మోడెల్ డ్రెస్ స్టిచ్ చేసి, గడువు మరో పది రోజులు ఉన్నదనగా పోటీకి పంపించింది. ఈసారి డిజైన్ నూతనంగా, సంతృప్తికరంగా అనిపించింది ఆమెకు. ఐతే దాన్ని ఎవరికీ చూపించకుండా గప్ చిప్ గా పంపేసింది...

ఆరెల్ల తరువాత - ఓ రోజున ప్యారిస్ నుండి ఫోన్ కాల్ వచ్చింది మధురిమకు. అవతలి వ్యక్తి మాట్లాడుతూంటే, తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఏదో ట్రాన్స్ లో ఉన్నదానిలా అయిపోయింది.

’మధురిమ డిజైన్ చేసిన డ్రెస్ కి ప్రథమ బహుమతి లభించింది! లక్ష డాలర్స్...!!’

పోటీని నిర్వహించిన సంస్థ యొక్క సెక్రెటరీ స్వయంగా ఫోన్ చేసాడు. ఆమె డెజైన్ అద్భుతంగా ఉన్నదంటూ అభినందించాడు. ఆమె ఇ-మెయిల్ కి అఫీషియల్ కమ్యూనికేషన్ పంపిస్తున్నట్టు చెప్పాడు.

కాల్ ముగియగానే గబగబా సిస్టెమ్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంది మధురిమ. ఆ మెసేజ్ ఆల్రెడీ బాక్స్ లో ఉంది.

ఆ వార్త ఇంట్లో గొప్ప సంచలనమే కలిగించింది. ’ఫ్యాషన్ పిచ్చిది’ అంటూ మధురిమను ఏడ్పించే కుటుంబసభ్యులకు ఆమె టాలెంట్ ఏమిటో తెలియవచ్చింది.

శ్యామలమ్మ ఆనందంతో కూతుర్ని ముద్దు పెట్టుకుంటే..."నా చిట్టితల్లివి అచ్చం వాళ్ళ తాతగారి తెలివితేటలే!" అంటూ పెద్ద మనవరాలిని ముఖమంతా ప్రేమగా తడిమి ముద్దులు పెట్టేసుకుంది బామ్మ. ఆ పిల్లకు దిష్టి తీసేయమని కోడలికి పురమాయించింది.

"అక్కా, అక్కా! ప్రైజ్ వచ్చిన డిజైన్ ని మాకు చూపించవా?" అంటూ నీరజ అక్కవెంట పడింది.

రెండు మోడెల్స్ తయారుచేసుకుని, ఒకటి పోటీకి పంపించింది మధురిమ. రెండవదానిని భద్రంగా తన బీరువాలో దాచుకుంది. దాన్ని బైటకు తీసింది.

దాన్ని అక్క చేతిలోంచి లాక్కుని కుతూహలంతో పరిశీలించింది నీరజ. చాలా బావుందని అంతా మెచ్చుకుంటూంటే, హఠాత్తుగా నీరజ నోటి నుండి, "ఓఁ, మై...!" అన్న చిన్న కేక వెలువడింది.

"అక్కా! ఇది...ఇది...అరవయ్యేళ్ళ క్రితం బామ్మ కుట్టించుకున్న పెళ్ళి డ్రెస్ లా లేదూ!?" అంది ఆశ్చర్యంగా.

"లాగుండడమేమిటీ, నీ తలకాయ్! ఈ డిజైన్ అదే! కాకపోతే మోడర్న్ టైమ్స్ కి అనుగుణంగా డిజైన్ లో చిన్న టింకరింగ్ చేసానంతే" నవ్వుతూ అంది మధురిమ కూల్ గా.

నోళ్ళు వెళ్ళబెట్టారంతా.

"చూసావటే, నా బుల్లి రాక్షసీ! నా డ్రెస్ లు ముసలికంపు కొడుతున్నాయంటూ ఎద్దేవా చేస్తూంటావు నువ్వు. అరవయ్యేళ్ళనాటిది ఇప్పుడు మోడర్న్ ఫ్యాషన్ అయి బహుమతి కూడా గెలుచుకుంది" అంది బామ్మ సగర్వంగా, నీరజను ఉద్దేశించి.

"నిజమే. ఫ్యాషన్లంటూ కొత్తగా ఎక్కణ్ణుంచో పుట్టుకురావు. అన్నిటిలాగే, అదీ ఓ సైకిల్. కాలంతోపాటు కొద్ది మార్పులతో అవే మళ్ళీ మళ్ళీ వస్తూంటాయి" అంది శ్యామలమ్మ నవ్వుతూ.

"మధు అక్కా! మా అందరికీ ఐ-మాక్స్ లో సినిమా చూపించి, స్టార్ హోటెల్లో గ్రాండ్ ఫీస్ట్ ఇవ్వాలి నువ్వు" అంటూన్న తమ్ముణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది మధురిమ.

- (స్వాతి వారపత్రిక, 22-8-2014)

(కామెడీ కథల పోటీలో రూ. 10,000 ల బహుమతి పొందిన కథ)telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.