ఆనంద్ వన్


‘అనుజా !అనుజా!’ అని పిలుస్తూ లోపలికి వచ్చారు విష్ణు.

‘ఓహో! ఏమి నా భాగ్యము , శ్రీవారు ఇవాళ తొందరగా ఇంటికి వేంచేశారే ?’ నాటక ఫక్కీలో అని నవ్వుతూ ఎదురు వెళ్ళాను

‘ఆఫీసులో పని త్వరగా అయిపోయిందోయ్ అందుకని నీతోనూ బాబుతోనూ సరదాగా గడుపుదామని వచ్చేశాను’

‘అయితే మాకూ మంచి రోజులు వస్తున్నాయన్న మాట’ అన్న నా పలుకులకి నవ్వి ‘అన్నట్లు ఏడీ నా పుత్ర రత్నం?’

‘ప్రక్కింటి వాళ్ళ పాప సౌమ్య తో ఆడుకుంటున్నాడు’

ఇంతలో వాళ్ళ నాన్నగారి బైకు చప్పుడు విన్నట్లున్నాడు రయ్యిన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళని చుట్టేశాడు నాలుగేళ్ళ హర్ష . కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతూ లోపలికి వెళ్ళారు విష్ణు , దుస్తులు మార్చుకుందామని .

నేనూ వంటగదిలోకి వెళ్ళాను హర్షకి పాలు , విష్ణు కి కాఫీ కలుపుదామని........!+!+!+!

విష్ణు ఉద్యోగరీత్యా మేము మహారాష్ట్రలోని నాగపూర్ కు 80 కి.మీ. దూరములో ఉన్న ఊరిలోని సర్వోదయ కాలనీలో ఉంటున్నాము. కాలనీ ఎదురుగానే విష్ణు ఆఫీసు.

సర్వోదయ కాలనీలోనే ఉన్న ఒక మిషనరీ స్కూలులో , ఈ సంవత్సరమే , హర్షని ఎల్.కె.జి. లో చేర్పించాము. ఆ చుట్టు ప్రక్కల చాలా గ్రామాలకు అది ఒక్కటే స్కూలు. అక్కడ బోధనా మాధ్యమం ఆంగ్ల భాష .

ఎల్.కె.జి. లో హర్షకి ఆంగ్ల అక్షరాలు...., వన్,టూ, త్రీ....... లు నేర్పిస్తున్నారు. హర్ష ఒక్కసారి వింటే చాలు ఏదైనా చాలా చురుగ్గా పట్టేస్తాడు. అందరూ వాణ్ణి ‘ఏకసంథా గ్రాహి ’అని ముద్దుగా పిలుస్తుంటారు… !+!+!

ఆనాడు రాత్రి హర్షకి అన్నం కలిపి తినిపిస్తున్నాను. వాడు హోమ్ వర్కు పుస్తకం లో వన్.., టూ అనుకుంటూ వ్రాస్తున్నాడు. విష్ణు ప్రక్కనే కూర్చుని వాడు వ్రాసేది చూస్తూ

‘అనుజా , వచ్చే ఆదివారం మన వాళ్ళు కుటుంబాలతో సహా దగ్గరలో ఉన్న ఆనంద్ వన్ చూడటానికి వెళదామంటున్నారు ఏమంటావు?” అన్నారు

ఆ మాటలకి వ్రాస్తున్న వాడల్లా ఒకసారి తలెత్తి విష్ణు కేసి చూసి మళ్ళీ వ్రాయడంలో మునిగిపోయాడు హర్ష.

‘అలాగే మీ ఇష్టం’ అన్నాను

ఆనంద్ వన్ (ఆనంద వనము) మా ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక ప్రదేశం. ప్రకృతి అందాలతో నిండిన ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుందని , అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని , అక్కడ ఒక ఆశ్రమం కూడా ఉందని , తప్పక చూడవలసిన ప్రదేశం అని అందరూ అనుకోగా విని ఉన్నాను నేను......

ఆదివారం ఉదయాన్నే మేము , మా ప్రక్క ప్రక్క ఇళ్ళలోని స్నేహితులు కలిసి ఒక పెద్ద కారు చేసుకుని ఆనంద్ వన్ చూడటానికి బయలుదేరాము.

హర్ష కారు ఎక్కినది మొదలుకుని, మధ్య మధ్యలో మా పెద్దవాళ్ళ కబుర్లకి తలతిప్పి చూస్తూ, మా ప్రక్క ఇంటి ఏడాది పాప , సౌమ్యతో ఆడుతున్నాడు.

అందరూ చెప్పినట్లుగానే ఆనంద్ వన్ అక్కడి ఆశ్రమం ఎంతో బాగున్నాయి. సరదాగా ఆ చుట్టు ప్రక్కలంతా తిరిగేసి మధ్యాహ్నానికి ఒకచోట చేరాము. ఇంటినుండి వండి తెచ్చుకున్న పదార్థాలతో భోజనాలు కానించాము.

మళ్లీ సాయంత్రం వరకూ తిరిగి ఫొటోలు తీసుకుని కారులో ఇళ్ళకి తిరుగు ముఖం పట్టాము.

కారు బయలు దేరుతుండగా ఉన్నట్లుండి ‘అమ్మా! ఆనంద్ టు ఎక్కడుంది?’ అడిగాడు హర్ష ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి

‘ఆనంద్ టు ఏమిటిరా?’ హర్ష బుగ్గలు పుణుకుతూ అడిగాను వాడి మాటలు అర్థం కాక .

మా మాటలకి కబుర్లు ఆపి అందరూ మా సంభాషణని ఆసక్తిగా వినసాగారు

‘మరేమో... ఇది ఆనంద్ వన్ కదా?’

‘అవును’

‘మరేమో... వన్ తరువాత టు వస్తుంది కదా?’

‘అవును , అయితే?’

‘మరేమో...ఇది ఆనంద్ వన్ అయితే ఆనంద్ టు ఎక్కడుంది?’

అప్పటికి అర్థమయింది నాకు అన్ని మరేమో లతో ఉన్న హర్ష ప్రశ్న . మరేమో.... అనేది వాడి ఊత పదం.....

చిన్న పిల్లలు తమ పరిసరాలలో జరిగే ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా గమనించి ఆకళింపుచేసుకుని దానికి తమ సొంత జ్ఞానం జోడించి తమదైన భాషలో అవే పదాలకి క్రొత్త క్రొత్త పరిభాషలు చెప్తుండడం పరిపాటి .

అప్పుడు చటుక్కున , ఆనాడు అన్నం తినిపిస్తుంటే వన్..టూ.....లు వ్రాస్తూ ‘ఆనంద్ వన్’ పదం వినగానే తలెత్తి విష్ణు కేసి చూడడం , జ్ఞాపకం వచ్చింది .

ఏకసంథా గ్రాహి కావడంతో ఆ క్షణం లోనే ఆ పదం వాడి చిన్న బుర్రలోకి ఎక్కి కూర్చుందన్నమాట !!!!!

ఇప్పుడు ఆ మాటకి సొంత జ్ఞానం జోడించి వాడి తెలివైన బుర్రలో తలెత్తిన అతి పెద్ద సందేహాన్ని బయటపెట్టాడు.

హర్ష చిన్న బుర్రకి , ‘ఆనంద్ వన్’ లో వన్ అనేది హిందీ పదము అని తెలుగులో దాని అర్థం వనము అని తెలియకపోవడంవలన , తాను నేర్చుకున్నట్లు వన్ తరువాత టు కాబట్టి , ఇది ‘ఆనంద్ వన్’ కాబట్టి ‘ఆనంద్ టు’ కూడా ఉంటుందనుకుంటున్నాడని అర్థమయింది .

అందుకే ‘ఆనంద్ టు’ ఎక్కడ అని ప్రశ్నించాడు !!

మా సంభాషణని కుతూహలంగా వింటున్న స్నేహితులకి హర్ష సందేహాన్ని వివరించి చెప్పాను .

పసివాడైన హర్ష అమాయకపు ప్రశ్నలోని భావం తెలియగానే ఒక్కసారిగా గల గలా నవ్వులు పువ్వులు విరిశాయి ఆ ప్రదేశమంతా ...

మేమంతా ఎందుకు నవ్వుతున్నామో తెలియక అలిగి బుంగమూతి పెట్టిన హర్షని ఎత్తుకుని ముద్దాడుతున్న విష్ణుని మురిపెంగా చూస్తుండిపోయాను.

*****సమాప్తం*****

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.