సహజీవనం

"నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం..." "ఎందుకనో..." "ఎందుకంటే ఏం చెప్పను... ఎన్ని విషయాలని చెప్పను..." "ఊరికే ఒక్క విషయం చెప్పు..." "పైన ఆకాశం, కింద భూమి. మధ్యలో ఈ మేడ. మేడకున్న పిట్టగోడ. దానికానుకుని నువ్వు నేను..." "కవిత్వమా..." "అలాంటిదే. ఏంటో నువ్వు పక్కనుంటే మాటలు లావాలా ఉబికొస్తాయి..." "నిజమా..." "నిజమా అని మామూలుగా అంటున్నావా...! నువ్వు పక్కనుంటే అదో వెన్నెల పండుగ..." "బాగుంది...బాగుంది... నిన్ను కదిలిస్తే ఆపమనే వరకు ఆపవు..." "హాయిగా వినొచ్చు కదా ... ఆపమనడం ఎందుకు......?" "................." "ఏంటీ నేనింత హ్యాపీగా మాట్లాడుతుంటే నువ్వంత మూడీగా వున్నావు. ఒంట్లో బాగోలేదా...?" "ఒంటికేం ఇబ్బంది లేదు... మనసే బాగోలేదు..." "ఏమయింది..." "ఇంట్లో అందరూ గుర్తొస్తున్నారు..." "అలా అని రోజుకు ఒకసారైనా చెప్తుంటావుగా...." "రోజూ చెప్పేది వేరు. ఇప్పుడు చెప్పేది వేరు..." "ఏంటో ఈ రోజు స్పెషల్..." "ఈరోజు అమ్మ బాగా గుర్తొస్తోంది..." "................." "జాగ్రత్తగా వుండు. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇంటికి పెద్దదానివి. దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్నావు. రకరకాల మనుషులుంటారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతలోనే వుండు... హద్దులు మీరకు... జీవితంలో ఏమైనా సంపాదించుకోవచ్చు గానీ మంచిది కాదు అనే ముద్ర పడిందంటే బతకడం కష్టం అని చెప్పేది అమ్మ. ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇవే మాటలు...." "....................." "నేనిప్పటికీ హాష్టల్లోనే ఉన్నాననుకుంటోంది అమ్మ. ఒకసారి ఊరికి వచ్చి వెళ్ళమంటోంది. మా ఫ్రెండ్స్ కోసం అరిసెలూ జంతికలూ చేసిందట... "


"అయితే ఇంకేం. తొందరగా వెళ్ళి తీసుకురా. ఇద్దరం ఈ వెన్నెల్లో కూర్చుని అన్నీ తినేద్దాం..." "అమ్మని మోసం చేస్తున్నానేమోననిపిస్తుంది."అయినా మనం చేసేది కరెక్టేనంటావా...?" "పరిచయమైన సంవత్సరం తర్వాతా ఈ ప్రశ్న అడిగేది..." "ఎన్ని రోజులని కాదు... కరెక్టేనా కాదా అని అడుగుతున్నా..." "ఒప్పు అనుకుంటే ఒప్పు... తప్పనుకుంటే తప్పు. అయినా మనమేమీ కొత్తగా చెయ్యట్లేదు కదా. అందరి దృష్టిలో ఇది ఫ్యాషన్. ఇప్పుడున్న ట్రెండునే మనం కూడా ఫాలో అవుతున్నాం...అంతే..." "అంతేనా... అంతకు మించి ఇంకేమీ లేదా..." "అంతగా మాట్లాడుకోవలసింది ఏముంది..." మన ప్రవర్తన మీద మన రెండు కుటుంబాలు ఆధారపడి వున్నాయి. కనీసం అదైనా గుర్తుందా..." "అంటే..." "మన ఇష్టాలకు సహజీవనం అని పేరు పెట్టుకుని మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని నేనను కుంటున్నాను..." "హాయిగా వున్న సమయంలో అనవసరంగా అవన్నీ గుర్తుచేసుకుని బాధపడడంలో అర్థం లేదు..." "మనిద్దరం హాయిగా వుంటే చాలా...? మనవాళ్ళు ఉండక్కర్లేదా..." "కలిసి వుండేవాళ్ళం మనమే కదా... మనం సంతోషంగా వుంటే వాళ్ళు కూడా సంతోషంగా వుంటారు..." "మనం పెళ్ళి చేసుకోం కదా... కలిసి వున్నట్లెలా అవుతుంది..." "పెళ్ళి సంగతి మనం కలిసినప్పుడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని సంగతి అనవసరం..." "అనవసరమే కాదనను... కానీ ఇప్పుడు అదే అవసరం అనిపిస్తోంది..." "అన్నీ ఆలోచించుకునే కదా ఇలా కలిసుంది..." "అప్పుడు కరెక్టేననిపించింది. ఆలోచించేకొద్దీ నాలో నాకే అంతర్మథనం ఎక్కువవుతోంది..." "సెంటిమెంట్ వున్నప్పుడు ఇటువంటివి అంగీకరించకూడదు..." ".................." "అయినా తొందరపడకుండా వుండాల్సింది..." "ఇప్పుడేమయిందని ఇంతలా బాధపడుతున్నావ్..." "సంవత్సరం నీతో కలిసుండి మళ్ళీ వేరేవాళ్ళని పెళ్ళిచేసుకోవాలంటే ఎంతైనా గిల్టీగా వుంటుంది కదా..." "లైట్ గా తీసుకోవాలి. ఇంత తీవ్రంగా ఆలోచించకు...." "నేను లైట్ గా తీసుకోలేకపోతున్నా...." "అయితే ఏం చేద్దామంటావు...?" "అదే అర్థం కావట్లేదు. అందరూ అంటుంటే ఎంతో ఊహించుకున్నాను. ఇబ్బందులు ఊహించలేదు...." "అంతగా ఆలోచించడం అవసరమంటావా...?" "అవసరమే... ఓపిక వున్నంతవరకు ఏమైనా సంపాదించుకోవచ్చు గానీ ప్రవర్తన విషయంలో కాలుజారితే...! బాబోయ్ ఊహించకోవడానికే ఏదోలా వుంది..." "నువ్వు ఎప్పుడో కాలుజారావు..." "అడుగు వేయడంలో ఎందుకు తొందరపడ్డానా అని ఆలోచిస్తున్నా...!" "చాలా సిల్లీగా ఆలోచిస్తున్నావు. లోకమంతా ఎంతో వేగంగా ముందుకెళ్తోంది. అన్ని కోర్కెలూ తీర్చు కోవడానికి ఆరాటపడుతోంది. వర్కులో వున్న టెన్షన్ నుంచి కొంచెం రిలీఫ్ కోసం ఇలా కలిసుండాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఏం ఇబ్బంది వుందో నాకర్థం కావట్లేదు...." "నువ్వు మగాడివి. ఏ విషయమైనా నీకు సిల్లీగానే వుంటుంది. ఆడవాళ్ళం అనేక బాధ్యతలు ఉన్నవాళ్ళం. ఎందుకనో నేను సిల్లీగా తీసుకోలేకపోతున్నా..." "నువ్వు అంతలా బాధపడటానికి మనం విషయం ఎవరికి తెలుసని...?" "ఎవరికో తెలియాలా...? మన మనస్సాక్షికి తెలియదా...?" "కాసేపు దాని గొంతు నొక్కేస్తే సరి..." "నా చిన్నప్పుడే మా నాన్న చనిపోతే ఎంతో కష్టపడి చదివించింది అమ్మ. మా దరిద్రం ఎక్కడ వాళ్ళకు అంటుంకుంటుందోనని బంధువులు ఎవరూ చేరదీయలేదు. ఇళ్ళల్లో పాచిపని వంటపని చేసి చదివించింది. నేను మా చెల్లి చాలా కష్టపడి చదివాం..." "ఊ.... తర్వాతా..." "మగతోడు లేకుండా ఒంటరిగా ఉంటున్నామని కుర్రకారు ఎందరో ఎన్నో కామెంట్స్ చేసేవాళ్ళు. వాళ్ళ కామెంట్స్ విని నేను బాధపడుతుంటే ఒకే మాట చెప్పేది అమ్మ..." "ఊ...." "మన తప్పు లేకుండా జరిగే ఏ పనికైనా మన బాధ్యత లేదని, బాధపడకూడదని అంటుండేది. మేము పెద్ద చదువులకు వచ్చినా తన పని విషయంలో రాజీపడేది కాదు, పాచిపని చేయడానికి సిగ్గుపడేది కాదు. పిల్లలు చేతికొచ్చారు. ఇక ఈ పనులు మానేయమని ఇంటిపక్కవాళ్ళు అంటున్నా వినేది కాదు. ఆడ దానికి ఆర్థికంగా స్వేచ్ఛ వుండాల్ని వాళ్ళతో చెప్తుండేది..." "ఇదిగో ఇప్పుడు నీకు బాగా స్వేచ్ఛ వుంది కదా. రెండుచేతులతో సంపాదిస్తున్నావు" "హడావిడిగా నిద్రలేవడం, ఆఫీసులకు పరుగులు పెట్టడం, అక్కడ దొరికినదేదో తినడం, నీరసంగా ఇంటికి రావడం, గుడ్ నైట్ చెప్పి పడుకోవడం, మళ్ళీ నిద్రలేవడం, పరిగెత్తడం. ఇదే మనం రెండుచేతుల తోనూ చేసేది. అంతేగా..." "ఎవరు చేసే పనైనా అంతే. కాకపోతే చేసే పనుల్లోనే తేడా వుంటుంది..." "శరీరానికి శ్రమ వుంటుంది కానీ మనసు మాత్రం దిగులుగా వుంటోంది. ఏదో కోల్పోతున్నామనే బాధ... అందరూ వున్నా అనాథల్లా బతుకుతున్నామనే భావన..." "అనాథల్లా ఎందుకుంటున్నాం? బాగానే ఎంజాయ్ చేస్తున్నాం కదా...?" "నిజమే... నా పుట్టినరోజు వస్తే నాకేది ఇష్టమో అది తెచ్చి నాకు బహుమతిగా ఇస్తావు. ఎక్కడికి తీసు కెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తావు. కాదనను. కానీ అమ్మ దగ్గర వుంటే అదే పుట్టినరోజులో ఏదో ప్రేమ వుండేది. అప్యాయత అణువణువూ ప్రతిధ్వనించేది. నాఇష్టమైనవన్నీ స్వయంగా చేసి కొసరి కొసరి తిని పించడంలో ఏదో తెలియని ప్రేమపాశం పెనవేసుకుపోయేది...." "అంటే రాణీగారికి అవన్నీ నేను చేయట్లేదా.." "నువ్వు చేయట్లేదని కాదు. కానీ..." "కానీ అంటే చేసినా ప్రేమతో చేయట్లేదు అంటావు? అంతేకదా..." "అలా అని కూడా కాదు..." "అయితే నీతో ఇక కష్టమే. నేను ఇంకొకరిని చూసుకోవాల్సిందే..." "చూశావా...! మన మధ్య ఏ బంధం లేదు కాబట్టి చాలా తేలికగా ఇంకొకరిని చూసుకుంటాను అన్నావు. అదే మనకి పెళ్ళి అయ్యుంటే ఆ మాట అనడానికి కొంతైనా ఆలోచించేవాడివి..." "పెళ్ళి అయినవాళ్ళు కూడా చాలామంది విడిపోతున్నారు..."

"నిజమే... కాదనను. కానీ అలా విడిపోవడానికి అటువాళ్లు ఇటువాళ్ళు ఒప్పుకోరు. సర్దిచెప్పి వాళ్ళను కలిసుండమనే చెప్తారు... " "అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను పెళ్ళిచేసుకోమంటావా?" "అదే మంచిదనిపిస్తోంది. అలా జరగడంవల్ల ఎవరికీ బాధ వుండదు..." "మా నాన్న ఒప్పుకోడు. ఆ విషయం మనం కలిసుండాలని నిర్ణయించుకున్నప్పుడే చెప్పాను. నువ్వు కూడా ఒప్పుకున్నావు..." "నన్ను చేసుకోవడం నీకు ఇష్టమైనప్పుడు మీ నాన్నకేంటి అభ్యంతరం..." "కులాలు చూడొద్దా. ఆయనకు మా కులంలోనే చేయాలని వుంది. పైగా మా మేనత్త కూతురితో చేయాలని కోరిక..." "ఆ విషయం నీకు ముందే తెలుసా..." "ఏ విషయం...?" "మీ మేనత్త కూతురితో నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నారని..." "అమ్మ రెండుమూడుసార్లు అంది..." "ఇంతకాలం నాతో కలిసుండి ఇప్పుడు తనని చేసుకుంటే గిల్టీగా వుండదా...?" "గిల్టీ ఎందుకు...? హాపీనే కదా..." "మన మధ్య శారీరకసంబంధం తప్ప మానసిక బంధం ఏమీ లేదా?" "కావాలనుకున్నాం... కలిసున్నాం... ఇద్దరికీ పెళ్ళిళ్ళు కుదిరితే వెళ్ళిపోతాం... అందులో మానసికంగా బాధపడ వలసిన అవసరం ఏముంది...?" "మనం కలిసినప్పుడు నా కులమేంటో తెలుసా...?" "కులం కలిసి వుండడానికి అక్కర్లేదు... పెళ్ళి చేసుకోవడానికి కావాలి..." ".................." "అయినా ఇన్నాళ్ళ నుండి కలిసి వున్నప్పుడు రాని సందేహాలన్నీ ఇప్పుడెందుకొస్తున్నాయో అర్థం కావట్లేదు..." "ఇప్పటికైనా రాబట్టి చాలా విషయాలు బయటికొచ్చాయి..." "అంటే..." "ఇందులో అర్థం కాకపోవడానికేమీ లేదు. ఆడదానికి శరీరమే కాదు మనసు కూడా ఉంది. కానీ మగవాళ్ళకి కేవలం శరీరం మాత్రమే వుంది. మనసు లేదు..." "ఎందుకలా అంటున్నావు..?" "అవసరమే అనుకున్నామో, ఆకర్షణలోనే పడ్డామో కానీ నేను కేవలం శారీరకసుఖం కోసమే నా శరీరాన్ని నీకివ్వలేదు. నీ ఆనందమే నా అనందం అనుకున్నాను. నీ బాధ నా బాధ అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం శారీరక సుఖం కోసమే నాతో కలిశావని నాకనిపిస్తోంది..." "అసలు ఇవన్నీ ఎందుకు? నన్నేం చేయమంటావో అది చెప్పు?" "మనం పెళ్ళి చేసుకుందాం..." "మళ్ళీ అదే పాట. మా ఇంట్లో ఒప్పుకోరని ఎన్నిసార్లు చెప్పాలి..." "ఒక్కసారి అడిగి చూడొచ్చు కదా..." "కష్టం..." "పెళ్ళి కానప్పుడు ఇలా కలిసుండడం ఎంతకాలం..." "మనకు నచ్చినంత కాలం వుండొచ్చు... అందులో అభ్యంతరం ఏముంది..." "కానీ మా అమ్మను మోసం చేస్తున్నాననే బాధ నన్ను వేధిస్తోంది. నా మనస్సాక్షికి విరోధంగా ఏమీ చేయలేకపోతున్నాను..." "అనుకుంటే అలాగే వుంటుంది. ఆలోచించడం మానేస్తే అన్నీ సర్దుకుంటాయి..." "మన సంఘంలో పెళ్ళికి చాలా ప్రాధాన్యత వుంది. ఒకరికి ఒకరు తెలియకపోయినా పెళ్ళి అనే బంధంతో ఒక్కటై ఒకరి కోసం ఒకరిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంటారు... కానీ ఇలా కలిసి వుండి ఏమీ తెలియనట్లు ఇంతకు ముందేమీ జరగనట్లు వేరే వాళ్ళతో పెళ్ళి ఒప్పుకోవడం మనల్ని మనం మోసం చేసు కోవడమే కాక మనల్ని చేసుకున్నవాళ్ళని కూడా మోసం చేసినట్లే..." "తప్పొప్పులు ఎవరు నిర్ణయించాలి...? అప్పుడు మనకు పెళ్ళి కాకుండా ఇలా కలిసి వుండడం ఒప్పు అనిపించింది. ఇన్నాళ్ళు గడిచాక అదే కలిసి వుండడం తప్పు అనిపిస్తోంది. అందుకే తప్పొప్పులు మన ఆలోచనల్లో వుంటాయి, మన ఆచరణలో ఉంటాయి తప్ప ఎవరో వచ్చి నిర్ణయించరు..." "అందుకే పెళ్ళి చేసుకుని ఆ తప్పును దిద్దుకుందాం అంటున్నా.." "అది కుదిరే పని కాదు అని నేనంటున్నా..." "అదే నీ నిర్ణయమైతే ఇక మనం కలిసి వుండడం అసాధ్యమే..." "................." "ఇన్నాళ్ళనుంచీ ఈ ఆలోచన ఎందుకు రాలేదా అని సిగ్గుపడుతున్నా. కుటుంబ పరిస్థితులు, సంఘం కట్టుబాట్లు తెలిసినదాన్ని, చదువుకున్నదాన్ని నా వ్యక్తిగత ప్రవర్తన విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా వున్నానో నాకర్థం కావట్లేదు. మన సంస్కృతీ సంప్రదాయాలకు గౌరవముంది, మన వివాహ సంప్రదాయానికి విలువుంది.. వాటిని సజీవంగా నిలపాల్సిన బాధ్యత మనలాంటి యువతరం మీద వుంది. మనమేమో సహజీవనం పేరుతో వాటన్నిటినీ ధ్వంసం చేస్తున్నాం... జరిగిన దానిలో నీ పొరపాటు ఎంతుందో నాదీ అంతే వుంది. నన్ను క్షమించు. మా అమ్మ కాళ్ళమీద పడి క్షమాపణలు అడగాలి..." "అంతేనా... ఇంకోసారి నాకోసం ఆలోచించు..." "ఇంతకాలం ఈ విషయంలోనే పొరపాటు చేశాను. ఇక చేయదల్చుకోలేదు ...బై..." "....................." *** *** ***

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.